తెలంగాణ పరిశ్రమలకు బిగ్ బూస్ట్.. గ్రీనింగ్ సమ్మిట్‌లో కీలక ప్రకటనలు

by Ramesh Naini |

తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

తెలంగాణ పరిశ్రమలకు బిగ్ బూస్ట్.. గ్రీనింగ్ సమ్మిట్‌లో కీలక ప్రకటనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. పరిశ్రమల రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రోత్సహిస్తూ, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడానికి తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్-ఎ ర్యాంప్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మంగళవారం జరిగిన ఈ సమ్మిట్ రాష్ట్ర పరిశ్రమల భవిష్యత్ దిశను ప్రతిబింబించింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయానికి చెందిన హైదరాబాద్ ఎస్ అండ్ టీ క్లస్టర్ సంయుక్తంగా ఈ సమ్మిట్‌ను నిర్వహించాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన ర్యాంప్ (రైజింగ్ అండ్ యాక్సలేరటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్) కార్యక్రమానికి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని పరిశ్రమలకు సాంకేతికంగా, పర్యావరణ పరంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఈ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ పోర్టల్‌తోపాటు ఎంఎస్ఎంఈ అసెస్‌మెంట్ టూల్‌కిట్‌ను ప్రారంభించారు.

రాష్ట్రంలోని పరిశ్రమలు ర్యాంప్ కార్యక్రమంపై పూర్తి సమాచారం పొందేందుకు, ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ఈ పోర్టల్ ఒకే వేదికగా ఉపయోగపడనుంది. సమ్మిట్‌లో విధాన నిర్ణేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, బ్యాంకింగ్ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు, పరిశ్రమ సంఘాలు ఒకే వేదికపై సమావేశమై ఈ రంగాన్ని పర్యావరణ హితంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి - పారిశ్రామిక ప్రగతి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు కాలుష్యాన్ని తగ్గిస్తూ, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీలో నిలవాలంటే తెలంగాణ పరిశ్రమలు సాంకేతికంగా మాత్రమే కాకుండా పర్యావరణ పరంగానూ బాధ్యతాయుతంగా మారాలని స్పష్టం చేశారు.

Next Story