- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. TGEAPCET-2026 షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET)-2026 ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘TG EAPCET-2026’ పరీక్షల నిర్వహణకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 9 నుంచి మే 11 వరకు మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయని కన్వీనర్ డాక్టర్ కె.విజయ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రకటించారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షా సమయాలు ఇవే..
ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రి 6 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. అభ్యర్థులను ఉదయం సెషన్‌కు 7.30 నుంచి మధ్యాహ్నం సెషన్‌కు 1.30 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని.. పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపబోమని వెల్లడించారు.
అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సినవి..
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు తమ హాల్ టికెట్‌తో పాటు కనీసం ఓ ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (Original Photo ID), నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, చేతి గడియారాలు (Wrist-watches), క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడం నిషేధం. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అయితే, తుది కీ ఆధారంగా మార్కులను నార్మలైజ్ చేసిన తర్వాతే ర్యాంకులను కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.






