RTC ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారనున్న బస్సుల్లో చార్జీలు

by Prasad Jukanti |

టీజీఎస్ ఆర్టీసీ సమ్మర్ డిస్కౌంట్ ముగియడంతో పాత చార్జీలను పునరుద్ధరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

RTC ప్రయాణికులకు  బిగ్ అలర్ట్.. మారనున్న బస్సుల్లో చార్జీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బిగ్ అప్ డేట్ ఇచ్చింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుందని సంస్థ ప్రకటించింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే ) పాటు ఇచ్చిన రాయితీ గడువు ముగుస్తుండటంతో జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత చార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. ఈ మార్పుపై ప్రయాణికులు ఎలాంటి గందరగోళం చెందవద్దని, ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని క్లారిటీ ఇచ్చింది. కేవలం సమ్మర్ డిస్కౌంట్ ముగియడంతో రాయితీకి ముందు ఉన్న పాత టికెట్ ధరలే అమలులోకి రాబోతున్నట్లు పేర్కొంది. తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సుఖవంతమైన, ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

Next Story