రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. అనర్హుల ఏరివేత మొదలైంది!

by Kema Shiva Kumar |

తెలంగాణలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, 15 ఎకరాల పైన భూమి ఉన్నవారు, ఖరీదైన వాహనాలు కలిగిన వారి కార్డులను రద్దు చేయనున్నారు.

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. అనర్హుల ఏరివేత మొదలైంది!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించేవారి ఆహార భద్రత కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్, పాన్​కార్డు వివరాలను ఆదాయ పన్నుశాఖ ద్వారా సేకరించి, వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేయనుంది. ఖరీదైన వాహనాలు కలిగివున్న వారి రేషన్ కూడా​బంద్​కానుంది. 83,545 మంది మరణించిన వారికి రేషన్​పంపిణీ జరుగుతుండగా.. నిబంధనలకు విరుద్దంగా రూ.135 కోట్లు ఖర్చు అవుతోంది. పీఎం కిసాన్​డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు తేలింది. 5866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా ఏటా వీరికి 1.50 లక్షల ఆదాయం మించింది. రాష్ట్రంలో రేషన్​కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఏటా లక్షల రూపాయలు ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని చాలామంది నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నానే గత రెండేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి.

పేదల ముసుగులో..

రేషన్​కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం, గ్రామాల్లో రూ.1.50 లక్షల ఆదాయంలోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు లక్ష రూపాయలు ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్​కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వీరంతా రేషన్​బియ్యం తినకుండా బ్లాక్​మార్కెట్‌లో అమ్ముకుంటున్నట్టు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చిన పీడీఎస్​రైస్‌ను​దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారు. ధనవంతులు ప్రభుత్వ రూల్స్​పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్దిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేషన్​ మాఫియా..

తెలంగాణలో రేషన్​కార్డు కలిగివున్న దాదాపు 8 లక్షలకుపైగా కుటుంబాలకు ఏటా రూ.25 లక్షల ఆదాయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు చేశారు. వీరంతా ఏటా దాదాపుగా 1.50 లక్షల మెట్రిక్​టన్నుల ఉచిత బియ్యం తీసుకుని రేషన్​మాఫియాకు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖలో పలు పథకాలు పొందడంతో పాటు, పిల్లల చదువుల కోసం రుణం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. రేషన్​బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పన్నంగా పొందినట్లు ఆరోపణలున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం

బీఆర్ఎస్​పాలనలో అడ్డగోలుగా కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్​ప్రభుత్వంలో కూడా కోటీశ్వరులు రేషన్​కార్డులను దర్జాగా పొందారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారి ఇంటింటికి వెళ్లి పరిశీలిన చేసిన మండలంలోని అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్లు తేలింది. ఇటీవలే కేంద్ర ఆహార, పంపిణీ శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్​కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ పౌరసరఫరాల శాఖకు పంపినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి, ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొంది. దీంతో జిల్లా పౌరసరఫరాల అధికారులు ఆ దిశగానే చర్యలకు సిద్ధమవుతున్నారు.

Next Story