రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్: ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-13 02:07:30  IST  )

తెలంగాణలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి.

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్: ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. ప్రభుత్వం 3 నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున షాపుల వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పుడు బియ్యం తీసుకోకపోతే మరో నెలల వరకు అవకాశం ఉండదన్న ఆందోళనతో, తెల్లవారుజాము నుంచే రేషన్ దుకాణాల (Ration Shops) వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే, సాధారణంగా నెలకు ఒకసారి ఇచ్చే రేషన్ కాకుండా, ఈసారి 3 నెలల కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో లబ్ధిదారులు తమ హక్కును కోల్పోతామేమో అన్న భయంతో ఒకేసారి షాపుల వద్దకు తరలివస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు పనులను మానుకుని మరీ రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

టెక్నికల్ సమస్యలు..

ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ మొదలవ్వడంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ సర్వర్ల (Servers)పై ఒత్తిడి పెరిగి చాలా చోట్ల ఈ-పోస్ (e-PoS) మెషీన్లు మొరాయిస్తున్నాయి. కొన్నిచోట్ల అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం, వాహనాలు ఆలస్యం కావడంతో స్టాక్ అయిపోయిందని డీలర్లు చెబుతున్నారు. వేలిముద్రలు పడకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రేషన్ షాపుల వద్ద రద్దీపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. రేషన్ పంపిణీకి ఈ నెల 30 వరకు సమయం ఉందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 నెలల బియ్యం అందుతాయని తెలిపారు. స్టాక్ విషయంలో ఎలాంటి కొరత లేదని.. సర్వర్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు ఒకేసారి రేషన్ షాపుల వద్ద గుమిగూడకుండా సహకరించా విజ్ఞప్తి చేశారు.

Next Story