అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మే 18న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు

by Kema Shiva Kumar |

తెలంగాణ టీజీ లాసెట్ (TG LAWCET), పీజీఎల్‌సెట్ 2026 పరీక్షలను మే 18న నిర్వహించనున్నారు.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మే 18న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, పీజీ ఎల్ సెట్ 2026 పరీక్షలు ఈనెల మే 18న నిర్వహించనున్నట్లుగా ప్రవేశ పరీక్షల కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ఏడాది మొత్తం మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. మూడేళ్ల లా కోర్సు‌కు సంబంధించి ఉదయం 9.30 నుంచి 11 వరకు సెషన్ 1, మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 47,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు, పీజీఎల్‌సెట్ పరీక్ష సాయంత్రం 4 నుంచి 5.30 వరకు జరుగనుంది. టీజీ లాసెట్ పరీక్షకు 14,020 మంది, పీజీ కోర్సు కోసం 5,200 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తంగా మూడు సెషనల్లో నిర్వహించే ఈ పరీక్షల కోసం ఇప్పటివరకు 66,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.

ఇక అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, మే 12వ తేదీ నుండి అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించారు. రూ. 4,000 ఆలస్య రుసుముతో మే 13 వరకు, రూ. 10,000 ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని సూచనలను గమనించాలని కన్వీనర్ సూచించారు.

Next Story