టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్: మే మొదటి వారంలోనే ఫలితాలు!

by Kema Shiva Kumar |

తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియనుండగా, 23లోగా మూల్యాంకనం పూర్తి చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్: మే మొదటి వారంలోనే ఫలితాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ వార్షిక పరీక్షల తుది ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఈనెల 16వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తిస్థాయిలో మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలనే సంకల్పంతో విద్యాశాఖ ముందస్తు వ్యూహరచన చేసింది. అందులో భాగంగానే ఏప్రిల్ 3వ తేదీ నుంచే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ప్రధాన భాషలు, గణితం వంటి పేపర్ల మూల్యాంకనం కొనసాగుతున్నది. కాగా, సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్లను రెండో విడత వాల్యూయేషన్ చేయనున్నారు. అంటే ఆయా సబ్జెక్టుల పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఈ క్రమంలో ఈనెల 23లోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది పూర్తయిన వెంటనే మార్కుల నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు.

గతేడాది ఏప్రిల్ 30న..

గతేడాది టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. అయితే, ఈసారి పరీక్షల షెడ్యూల్, మూల్యాంకం, మార్కుల నమోదు ప్రక్రియ తదితర కారణాల దృష్ట్యా మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దృష్ట్యా, ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Next Story