BIG Alert: అశావహులకు బిగ్ అలర్ట్.. అప్పుడే సర్పంచ్ ఎన్నికలు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

BIG Alert: అశావహులకు బిగ్ అలర్ట్.. అప్పుడే సర్పంచ్ ఎన్నికలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్, పదో తరగతి వార్షిక, ప్రవేశ పరీక్షలు, వేసవి కాలం దృష్ట్యా మరో నాలుగైదు నెలల తర్వాతనే ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువుగా నిర్ధేశించింది. దీనిని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పథకాలు అన్ని గ్రామాల్లో అమలవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు మరో రకంగా ఉంటాయని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించినట్టుగా తెలిసింది. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు రసాభాసాగా మారడంతో గ్రామాల్లో వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు సైలెంట్‌గా.. ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ధిచెప్పినా అక్కడి ప్రజలు వినేట్లుగా లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలపై ప్రభావం పడుతుందని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ, ప్రభుత్వం ఫ్లాష్​సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.

గ్రామసభల్లో ఆందోళనలు..

ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన నాలుగు పథకాల్లో రేషన్ కార్డుల విషయంలోనే ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత ఎదురవుతున్నది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చాలా మంది కొత్త కార్డుల కోసం దాదాపు 3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వారికి రేషన్​కార్డు రాలేదు. జాబితాలోనూ చాలా మంది పేర్లు మిస్ అయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ జాబితాను ప్రామాణికంగా తీసుకున్నారని గ్రామసభల్లో అధికారులను ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికార పార్టీ.. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రాథమికంగా ఒక అవగాహనకు, అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్..

వచ్చేనెలలో బీసీ డెడికేటెడ్​కమిషన్ నివేదిక వస్తుంది. దానిపై చర్చించి కేబినెట్​ఆమోదం తెలపనుంది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్​వస్తుందనే అంచనాలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. ఒకసారి కోర్టుకు వెళ్తే కేసు క్లియర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 50 శాతం కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వంలోని పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీల నేతలందరికీ ఈ విషయం తెలిసినా బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్టుగా షో చేస్తున్నారని బీసీ వర్గాల్లోని కొందరు ఆరోపిస్తున్నారు.

ఓ వైపు పరీక్షలు.. మరో వైపు ఎండలు

మార్చి నెలలో ఇంటర్, ఆ తర్వాత పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రవేశపరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. అప్పటికే ఎండా కాలం ప్రారంభం అవుతుంది. వేసవిలో సహజంగానే వచ్చే విద్యుత్​అంతరాయం, తాగునీటి కొరత లాంటి సమస్యలను ప్రతిపక్షాలు పెద్దవిగా చేసి ప్రజలను మరింత రెచ్చగొడుతాయని, దీంతో సమస్య తీవ్రతరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.

కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన..

రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంత పాలకవర్గాల గడువు ముగిశాయి. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తవగా..ఎంపీపీ, జడ్పీ‌చైర్మన్ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. వీటన్నింటికి వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఒక ఎన్నిక ప్రారంభమైతే వరుసగా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది.

Next Story