- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణాదికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా బీబీనగర్ ఎయిమ్స్: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించి, దక్షిణ భారతదేశానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుస్తామని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీబీనగర్ ఎయిమ్స్ ను దక్షిణ భారతదేశానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. మెడికల్ ఎడ్యుకేషన్, పేషెంట్ కేర్, రీసర్చ్ రంగాల్లో బీబీనగర్ ఎయిమ్స్ తన ప్రత్యేకతను చాటుకోనుందని ఆయన పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఎయిమ్స్ పనులను వేగవంతం చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను ఆయన వైద్యులు, నిర్మాణ పనులు చేపట్టిన ఎన్సీసీ ప్రతినిధులతో మాట్లాడారు. పనులు వేగం పెంచేందుకు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం హాస్పిటల్, మెడికల్ కాలేజీ, ఇతర భవనాలను బ్యాటరీ కారులో తిరిగి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 87 శాతం పనులు పూర్తయ్యాయని... ఈ ఏడాది చివరి నాటికి ఎయిమ్స్ పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు. అప్పటి వరకు ప్రతి వారం ఈ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
తమ హయాంలోనే ఎక్కువ ఎయిమ్స్..
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య, మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో దేశంలో ఢిల్లీలో మాత్రమే ఎయిమ్స్ మాత్రమే ఉండేదని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఐదు కొత్త ఎయిమ్స్ ఏర్పాటు చేశామన్నారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు కేవలం రాయ్ బరేలీలో మాత్రమే ఒక్క ఎయిమ్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మరో 19 ఎయిమ్స్ కు ఆమోదం లభించగా వాటిలో 14 ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. దీంతో ఇప్పుడు దేశంలో ఎయిమ్స్ సంఖ్య మొత్తం 26కు చేరుకున్నట్లు వెల్లడించారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి సుమారు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నామని... ఇక్కడ పరిశోధన కోసం రూ.64 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఆస్పత్రిలో 24 వైద్య విభాగాలు పనిచేస్తుండగా, ఇప్పటికే రెండు ఎంబీబీఎస్ బ్యాచ్ లు పూర్తయ్యాయని అన్నారు. నిత్యం సుమారు 1800 మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అత్యవసర చికిత్సలు, డయోగ్నోస్టిక్ టెస్టులు, టెలీ మెడిసిన్ సేవలు బాగా అందుతున్నాయన్నారు. డిజిటల్ కన్సల్టేషన్ (ఈ-సంజీవని) ద్వారా లక్షలాది మంది రోగులు సేవలు పొందారని తెలిపారు. ఇక్కడ 132 మంది అధ్యాపకులు, 133 మంది సీనియర్ రెసిడెంట్లు పని చేస్తున్నట్లు వివరించారు. ఎండీ, డీఎం(ఎంసీహెచ్) పీజీ కోర్సులున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఈ హాస్పిటల్ ను కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామన్నారు. 129 ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధన జరుగుతోందని... ఇక్కడి ఫ్యాకల్టీ 156 పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్
దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ బీబీనగర్ ఎయిమ్స్ లోనే ప్రారంభమైందని నడ్డా వివరించారు. ఇందులో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, వ్యాధి నివారణ చర్యలు, నిపుణులైన డాక్టర్ల సూచనలు ప్రసారం చేస్తారని తెలిపారు. ముఖ్యంగా డయల్ ఏ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా రేడియోకి ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. అలాగే ఎయిమ్స్ నుంచి 6 గ్రామాలను దత్తత తీసుకున్నారని... ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారని... సుమారు 66 వేల మందికి పైగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందాయన్నారు. '
పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది, ఆధునిక వైద్య సదుపాయాలతో బీబీనగర్ ఎయిమ్స్ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందిస్తోందని, రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శ వైద్య సంస్థగా నిలుస్తుందని నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. 2032 నాటికి బీబీనగర్ ఎయిమ్స్ అన్ని రకాల అత్యాధునిక సేవలు అందించే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.






