- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti: గుడ్ న్యూస్.. జూన్ 2న వారికి సాగు భూమి పట్టాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. అందుకే ప్రజలు కోరుకున్న విధంగా భూభారతి (Bhubharati) చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఇవాళ మంచిర్యాలలో భూభారతి అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికార బృందం పర్యటించి, అక్కడి రెవెన్యూ చట్టాలను పరిశీలించి వాటిలోని మంచిని తీసుకుని భూభారతి తెచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తయారు చేయడానికే 6 నెలల సమయం పట్టిందని, మొదటి విడతగా 4 మండలాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం సాదాబైనామా కింద దరఖాస్తులు స్వీకరించినా సమస్యలు పరిష్కరించలేదని, 2020 ఆర్వోఆర్ చట్టంలో సాదాబైనామా పెట్టలేదన్నారు. సాదాబైనామా అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు.
జూన్ 2న రైతులకు పట్టాలు..
రైతులకు ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల మధ్య గట్ల పంచాయితీలు ఉన్నాయని, సర్వే చేయించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అతి త్వరలో చూపిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేద రైతుల జాబితాను సిద్ధం చేసి వారికి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా సాగుకు పట్టాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే జూన్ 2 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాలకు ఎమ్మార్వో స్థాయి అధికారులు వచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్యాక్రాంతానికి గురైన పేదల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుని వాటిని తిరిగి పేదలకే పంచుతుందని తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన మీరు ఈ చట్టాన్ని రైతులకు చుట్టంలా మార్చాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
కేసీఆర్ చేసిన అప్పుల కుప్ప..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కేసీఆర్ (KCR) రూ.8.19 లక్షల కోట్లు అప్పులు చేసి మన నెత్తిన పెట్టిపోయారని పొంగులేటి తెలిపారు. అయినా గత ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూనే అదనంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామన్నారు. పేదలకు మంచి చేయాలనే తాపత్రయం ఉన్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అండగా ఉండాలని మంత్రి కోరారు.






