Bhubharati: అన్నదాతలకు తీపి కబురు.. భూభారతిలో ఇక ‘ఏఐ’!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-05 01:39:25  IST  )

ఇలా.. సామాన్యుల అనుమానాలను నివృత్తి చేసేలా, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Bhubharati: అన్నదాతలకు తీపి కబురు.. భూభారతిలో ఇక ‘ఏఐ’!
X

రైతు: నాకు పట్టా భూమి ఉంది. కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు?

ఏఐ: మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది.

రైతు: కానీ నాది పట్టా భూమి. సర్వే నంబరు 1, ఊరు, మండలం, జిల్లా వివరాలు..

ఏఐ: మీరు ఈ మాడ్యూల్‌లో అప్లయ్ చేసుకోండి.

రైతు: ఏమేం ఫైల్స్ అప్‌లోడ్ చేయాలి?

ఏఐ: మీ పాస్‌బుక్, సేల్‌డీడ్, మరికొన్ని పత్రాలు..

దిశ, తెలంగాణ బ్యూరో: ఇలా.. సామాన్యుల అనుమానాలను నివృత్తి చేసేలా, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఆర్వోఆర్-2025 చట్టాన్ని ఆమోదించగా.. అమలుకు సమర్థవంతమైన, పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నది. మార్గదర్శకాల రూపకల్పన దాదాపుగా పూర్తి కాగా, త్వరలో మంత్రి పొంగులేటి ఆమోదానికి పంపనున్నారు. ఇప్పుడు భూభారతిలో కృత్రిమ మేధను వినియోగించి.. రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపేలా సర్కారు వ్యూహరచన చేస్తున్నది. ఆఫీసుకు వెళ్లడం.. ఎవరినైనా అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవడం కామన్. అలాగే హెల్ప్ డెస్కుల ద్వారా సాయం పొందేందుకు వీలుంది. అయితే భూ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల సమర్పణ వంటి ప్రతి అంశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.

యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్

ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ సామాన్యులకు అర్థం కాని విధంగా ఉన్నది. ఏ సమస్య వస్తే ఏ మాడ్యూల్ లో అప్లయ్ చేసుకోవాలో కనిపెట్టడం కష్టంగా మారింది. ఒక సమస్య పరిష్కారానికి నాలుగైదుసార్లు దరఖాస్తు చేసి.. ప్రతి సారీ రూ.వెయ్యి వంతున ఫీజు చెల్లించాల్సి వస్తున్నది. అందుకే భూ భారతి వెబ్ పోర్టల్ ను యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సామాన్య రైతులు, భూ హక్కుదారుడికి ఎలాంటి సందేహమొచ్చినా నివృత్తి చేసేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు. సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఎలా? అనే విషయాన్ని ఏఐ ద్వారా సమాచారం ఇస్తారు. ఏ సమస్య తలెత్తినా దానికి ఎలా అప్లయ్ చేయాలి? ఏమేం డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి? అనే విషయాలు తెలిపేలా ఉంటుంది. భూమి, హక్కులు, టైటిల్, పాసు బుక్స్, పహానీ వంటి అనేక సమస్యల పరిష్కారానికి యూజర్ ఫ్రెండ్లీగా, సామాన్యులకు అర్థమయ్యేలా రూపొందించాలని అనుకుంటున్నారు.

భూ భారతి నుంచే ప్రశ్నలు

కొత్త పోర్టల్ లో ప్రవేశపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అవసరమైన డేటా బేస్ ను భూ భారతి చట్టం (ఆర్వోఆర్-2025) నుంచే తయారు చేయనున్నారు. ఈ చట్టం అమలు చేసేటప్పుడు తలెత్తే ప్రతి డౌట్, సొల్యూషన్ వైపు ఉంటుంది. ఎలా అప్లయ్ చేసుకోవాలి? ఎవరిని కలవాలి? ఏమేం అప్ లోడ్ చేయాలి? ఏ మాడ్యూల్ లో అప్లయ్ చేయాలి? సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి? ఇలా ప్రతి ప్రశ్నకు ఏఐ నుంచి రిప్లయ్ వచ్చేలా డేటా బేస్ ను సిద్ధం చేయనున్నట్లు సీఎమ్మార్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ తెలిపారు. అయితే కొత్త పోర్టల్ లో ఇది ఇంటిగ్రేట్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కొత్త పోర్టల్ ను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా రూపొందించే క్రమంలో ఏఐని అమలు చేసే టెక్నికల్ సపోర్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ధరణి ‘అన్ ప్రొఫెషనల్’

ప్రస్తుత అవసరాలకు ధరణి పోర్టల్ ఏమాత్రం సరిపోదని గుర్తించారు. ఐదారు మాడ్యూళ్లతో మొదలుపెట్టిన పోర్టల్ 35కి పెరిగింది. అవసరానికి మించిన టేబుల్స్ ఉన్నాయి. 500 టేబుల్స్‌తో సరిపోయే స్థానంలో 4,500 వరకు వేశారు. డేటా బేస్ ప్రొసీడింగ్స్ ను ఏడు నుంచి ఎనిమిది వేల వరకు పెంచారు. మూడు లక్షల కోడింగ్ లైన్స్ అనుకున్న చోట 30 లక్షలు వినియోగించారు. డేటా సామర్థ్యం కంటే సాఫ్ట్ వేర్ ఓవర్ లోడ్ అయ్యింది. దీంతో అనవసరపు డేటా పేరుకుపోయి పోర్టల్ స్లో అయింది. ఈ క్రమంలో సరికొత్త మార్గాలను ప్రవేశ పెట్టడానికి కుదిరే చాన్స్ లేదు. దాంతో సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ నేతృత్వంలో టెక్నికల్ టీమ్ అవిరాళంగా కృషి చేశారు. ఇప్పుడిప్పుడే పోర్టల్ గాడిలో పడింది. అయితే ఇప్పుడున్న ధరణి పోర్టల్ కు లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ఏఐ వంటి విధానాలను ఇంటిగ్రేట్ చేసేందుకు సాంకేతికత అడ్డొస్తుందని అధికారులు చెబుతున్నారు.

Next Story