భూ భారతి కొత్త పోర్టల్ రెడీ.. ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ అమలు

by Malleboina Mahesh |

తెలంగాణలో భూ భారతి కొత్త పోర్టల్ సిద్ధమైంది. ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అప్పీల్ వ్యవస్థ, ఆధార్ ఆధారిత లాగిన్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

భూ భారతి కొత్త పోర్టల్ రెడీ.. ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతి కొత్త పోర్టల్ సిద్ధమైంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తీర్చిదిద్దిన పోర్టల్ సిటిజన్ ఫ్రెండ్లీ గా ఉంది. సమాచారం, ఫిర్యాదులు, లావాదేవీలకు అవకాశమిస్తున్నారు. ప్రస్తుతం నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండ‌లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. భూ భారతి చట్టంలో పొందుపరిచిన అప్పీల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు కొత్త పోర్టల్ లో మాడ్యూల్స్ ను ఏర్పాటు చేశారు. జీపీవో, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారో కూడా దరఖాస్తుదారుడికి తెలిసేలా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా డిజిటల్ మోడ్ లోనే ఉంటుంది. భూ భారతి వెబ్ సైట్ bhubharati.telangana.gov.in ఓపెన్ చేయగానే గతంలో లాగిన్ ఆప్షన్ ఎడమ వైపు ఉండేది.

ఇప్పుడు దాని పక్కనే పైలట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే రైతు ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావడానికి అవకాశం కల్పించారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ కొట్టగానే మొబైల్ కి నెంబర్ వస్తుంది. అంటే ఆధార్ నంబర్ కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాని ద్వారానే లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐదు మాడ్యూల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ భూ భారతి ఆప్షన్లు కేవలం పైలెట్ మండలాలకు మాత్రం పరిమితం. ఆ మండలాలకు చెందిన రైతుల ఆధార్ నంబర్ ద్వారా మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

ఇంటిగ్రేటెడ్ భూ భారతి ఆప్షన్లు

ఇన్ఫర్మేషన్ సర్వీసెస్: ఆర్వోఆర్ –1బీ, అప్లికేషన్ స్టేటస్, యజమానుల హిస్టరీ, పీవోబీ స్టేటస్ వంటివి చూసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ సర్వీసెస్: ఆధార్ అథెంటికేషన్ భూ యజమానులు మాత్రమే రిజిస్ట్రేషన్ బుకింగ్ స్లాట్స్ ను పొందగలరు. అనధికారిక ట్రాన్సాక్షన్స్ కు అవకాశం కల్పించొద్దన్న ఉద్దేశ్యంతోనే కేవలం భూ యజమానులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

సర్వే మ్యాప్ సర్వీసెస్(ఎల్పీఎం): ఎవరైనా సర్వే వివరాలు, ల్యాండ్ పార్శిల్ మ్యాప్స్, సర్వే నంబర్ బౌండరీస్, విస్తీర్ణం, జియో రెఫరెన్స్ లొకేషన్ వంటివి ఉంటాయి. ఐతే ఇవి భూ భారతిలో లేవు. ఎవరైనా వారి సొంత భూమికి సర్వే మ్యాప్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ద్వారా జియో కో ఆర్డినేట్స్ తో కూడిన మ్యాప్స్ పొందే వీలుంది.

రెవెన్యూ సర్వీసెస్: ఇది భూ భారతిలో వివిధ సమస్యల కోసం దరఖాస్తు చేసుకునే మాడ్యూల్స్ అన్నింటినీ కలిపి చేశారు. ల్యాండ్ రికార్డుల కరెక్షన్, యజమానుల వివరాల తప్పొప్పులు, విస్తీర్ణం మిస్సింగ్, సర్వే నంబర్ మిస్సింగ్, ఆధార్ లింకేజీ వంటి వాటికి ఈ మాడ్యూల్ ని వినియోగించుకోవాలి.

అప్పీల్ సర్వీసెస్: భూ భారతిలో అప్పీల్ వ్యవస్థ లేదు. ఇంటిగ్రేటెడ్ భూభారతి ద్వారా అప్పీల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎవరైనా అప్పీల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ల్యాండ్ రికార్డులు, అప్లికేషన్లను ట్రాకింగ్ చేసే సదుపాయాన్ని కల్పించారు.

కొనసాగుతున్న పైలెట్ ప్రాజెక్ట్

ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను ఎంపిక చేసిన ఐదు మండలాలకే పరిమితం. ప్రస్తుతం దీన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి? టెక్నికల్ ఇష్యూస్, అప్లికేషన్స్, అప్ లోడ్స్, పరిష్కారంలో ఫలితాలను బట్టి తిరిగి చేర్పులు, మార్పులు చేపట్టనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో ఐదు మండలాల్లో అమలు ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ భూ భారతిలో రైతు ఆధార్ నెంబర్ ద్వారా మాత్రమే ఎంట్రీ కావాలి. ఇతరులు భూముల వివరాలు చూసే సదుపాయం లేదు. ఐతే రానున్న రోజుల్లో ఇదిలాగే కొనసాగిస్తారా? లేదంటే ఎవరైనా అందరి భూముల వివరాలను చూసేలా అవకాశం కల్పిస్తారా? అన్న విషయం ప్రశ్నార్ధకంగా ఉంది. భూముల డేటా పారదర్శకంగా ఉండాలంటే ఎవరైనా, ఎవరి భూముల వివరాలనైనా చూసేలా ఉండాలి. ధరణి, భూ భారతిలో అన్ని భూముల వివరాలు చూడడానికి వీలుంది.

Next Story