- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భూ భారతి’ పోర్టల్‌ను హ్యాక్ చేసి లక్షల్లో దోపిడీ.. రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ దందా
యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న భారీ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భూ భారతి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని, సిటిజన్ లాగిన్ ద్వారా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని నకిలీ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాక్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు.

యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న భారీ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భూ భారతి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని, సిటిజన్ లాగిన్ ద్వారా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని నకిలీ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాక్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు. చలాన్లలో రూ.లక్షలు ఉన్నట్లు చూపిస్తూ వాస్తవానికి కేవలం పది శాతం సొమ్మును మాత్రమే చెల్లిస్తూ రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్న తీరు అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ అక్రమాలకు పాల్పడుతున్న యాదగిరిగుట్టకు చెందిన బస్వరాజు, రాజాపేటకు చెందిన పాండులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం జనగామలోనే పది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8.55లక్షల ఆదాయానికి గండి పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని అక్రమాలు జరిగాయనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. నిందితులు హ్యాకర్ల సాయంతో పేమెంట్ పేజీని ఎడిట్ చేస్తూ తహశీల్దార్లకు ఎటువంటి అనుమానం రాకుండా పూర్తి సొమ్ము చెల్లించినట్లుగా రికార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు లేదా టెక్నికల్ సిబ్బంది పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. లోకాయుక్త సైతం ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించడంతో రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ దందా ఇతర జిల్లాల్లోనూ విస్తరించి ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, నిందితుల కాల్ డేటా ఆధారంగా నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఉన్నారు. రైతులు, భూ యజమానులు సైతం ఈ పోర్టల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట కేంద్రంగా అతి పెద్ద భూ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణం బయటపడింది. ఈ నెల 7న జనగామ తహశీల్దార్ జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా గుట్ట పట్టణంలో సీఎస్సీ సెంటర్ నిర్వహిస్తున్న యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లికి చెందిన బస్వారాజ్, రాజాపేటలో సీఎస్సీ నిర్వహిస్తున్న రాజపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పాండును జనగామ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అసలు ఏం జరిగింది..?
ఇటీవల జనగామలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక్కరోజే రూ.8లక్షలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కేవలం 10 రిజిస్ట్రేషన్ల ద్వారానే ప్రభుత్వానికి రూ.8.55లక్షలు నష్టం కలిగినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ములో గత కొద్ది రోజులుగా తేడాలను గమనించిన జనగామ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించుకొని...
ఇంటర్నెట్ సెంటర్, సీఎస్సీ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. భూ భారతి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధిత పోర్టల్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. భూ భారతి సిటిజన్ లాగిన్‌లో ఎవరైనా భూములను స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం ఉంది. ఈ విధానం సక్రమంగా చేయాల్సి ఉండగా ఇంటర్నెట్ కేంద్రాల నిర్వహకులు దానిలో లొసుగులను ఆసరా చేసుకొని ఎడిట్ ఆప్షన్‌లో పేమెంట్ మొత్తం చేయకుండా సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో పేమెంట్ మొత్తం పూర్తి చేసినట్లు స్లాట్ బుకింగ్‌కు వెళ్లే ఆప్షన్ విధానాన్ని హ్యాకర్ సహాయంతో కనుగొన్నట్లు తెలుస్తోంది. దీని సాయంతో ప్రభుత్వానికి భారీగా చలాన్లు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లికి చెందిన బస్వరాజ్ అనే వ్యక్తి యాదగిరిగుట్టలో ఇంటర్నెట్ కేంద్రం ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ల చలాన్లు పూర్తిచేసే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు అతడి అనుచరుడైన రాజపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పాండు రాజాపేటలో ఇంటర్నెట్ సెంటర్ కేంద్రం పెట్టుకొని కూడా అక్రమాలకు పాల్పడినట్లు విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్షల్లో చలాన్లను అదే అంకెలు వచ్చేటట్లు వేలల్లో చెల్లిస్తూ చెల్లించేది 10 శాతం అయితే, మొత్తం చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే దశలో తహశీల్దార్‌కు ఎలాంటి అనుమానాలు రాకుండా చలాన్ మొత్తం పూర్తిగా చెల్లించినట్లు చూపిస్తూ దందా కొనసాగించినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ శాఖ సీసీఎల్ఏకు భారీ స్థాయిలో ఆదాయానికి గండి కొట్టినట్లు బయటపడింది.
పూర్తిస్థాయిలో విచారణ...
రాష్ట్రస్థాయిలో భూ భారతి పోర్టల్ టెక్నికల్ సిబ్బందికి, సీసీఎల్ఏ అధికారులు, మండల స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఏమైనా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందా? లేదా? అని పూర్తిస్థాయిలో విచారణ చేస్తే గాని అసలు వివరాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. పూర్తిస్థాయిలో భూ భారతి పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీపై పకడ్బందీగా ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. భూ భారతి రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులో లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, భూ పరిపాలన శాఖ అధికారులకు నిర్దేశించింది.
జిల్లాలో ఇద్దరేనా..?
అయితే ఇంతటి కుంభకోణంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఇతర ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారా? అనే అనుమానాలు అందరిలో రేకెత్తిస్తున్నాయి. ఈ ఇద్దరు నిర్వాహకులకు ఇతర జిల్లాల్లో సైతం ఈ పనులకు సంబంధించి పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.






