- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ భారతి చట్టం రెవెన్యూకు కొత్త ఊపిరి : రెవెన్యూ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమలులోకి వస్తున్న భూ భారతి చట్టం రెవెన్యూ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమలులోకి వస్తున్న భూ భారతి చట్టం రెవెన్యూ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరగడంతో పాటు రెవెన్యూ సేవలు, పౌర సేవలు చేరువ అవుతాయన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా లభించిందన్నారు. గ్రామీణ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కావడం వలన రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఆర్డీవో కె.రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసొసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు.
రెవెన్యూ ఉద్యోగులు కూడా పునరేకీకరణ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి జీపీవోలుగా వస్తున్న పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం జీపీవో పోస్ట్ కొత్తగా క్రియేట్ చెసిందని, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగానే జీపీవోలకు కూడా పదోన్నతులు వస్తాయన్నారు. ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వచ్చిట్లుగానే కామన్ సర్వీస్ తో పాటు పదోన్నతులు వస్తాయన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేoదుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలో నియామకం చేస్తుందన్నారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సమీప భవిష్యత్తులోనే ఓ భరోసా దొరుకుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవడంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను దశల వారిగా పరిష్కరించుకుంటున్నామన్నారు. ధరణిలో తహశీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో తహశీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్ఏ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని లచ్చిరెడ్డి తెలిపారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసి వివరించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను వివరించడం జరిగిందన్నారు. తమ వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా, కారుణ్య నియామకాలను చేపట్టేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి, రాష్ట్ర మంత్రివర్గంతో పాటు రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ గారి, ప్రభుత్వ పెద్దలలందరి సహకారంతో అనతి కాలంలోనే అనేక చారిత్రిక విజయాలను తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ సాదించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచిన ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని లచ్చిరెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం కోరుకుంటున్న సంక్షేమం, ఇతర శాఖాపరమైన పదోన్నతులు, బదిలీలు మరియు సీనియారిటీ అంశాల గురించి మనమంతా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభలో ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆట పాటలతో సభికులను ఉర్రూతలూగించాయి. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరుగగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, అసోసియేట్ అధ్యక్షులు చల్ల శ్రీనివాస్, టీజీజీఏ సెక్రటరీ జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి. రాధ, డీఆర్వో వెంకటాచారి, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావు, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.






