కొనసాగుతోన్న భట్టి బడ్జెట్ ప్రసంగం.. చెవిలో పువ్వు పెట్టుకుని BRS ఎమ్మెల్యేల వాకౌట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 08:37:21  IST  )

తెలంగాణ బడ్జెట్‌కు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ‘తులం బంగారం’, ‘రెండు లక్షల ఉద్యోగాలు’ మోసం అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎంట్రీ గేటు వద్ద ధర్నాకు దిగారు.

కొనసాగుతోన్న భట్టి బడ్జెట్ ప్రసంగం.. చెవిలో పువ్వు పెట్టుకుని BRS ఎమ్మెల్యేల వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌కు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందని అర్థం వచ్చేలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవులలో పూలు పెట్టుకుని సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే, ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ‘ఆరు గ్యారంటీల’ అమలు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

బడ్జెట్ ప్రసంగం నుంచి వాకౌట్ చేసిన అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ (Entry Gate) వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తులం బంగారం మోసం మోసం’ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని ఆరోపించారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అంటూ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఇక ‘బడ్జెట్ మోసం మోసం’ అంటూ, ఈ బడ్జెట్‌లో పేదలకు, రైతులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.

Next Story