- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka: ఆ బాధ్యత నాదే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై భట్టి కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తూ.చ తప్పకుండా ఖర్చు చేసే బాధ్యత నాది అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ (SC, ST Sub Plan) నిధుల ఖర్చులు చేస్తున్నారా లేదా అనే అంశంపై ఇప్పటికే అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. నివేదికలు వచ్చాక పక్కాగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేసుకోగలిగామని ఈ విషయాన్ని మీరంతా వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఆదివాసీ సాధికారత శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది. వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (KCR) నాయకత్వంలో హక్కులతో పాటు మా స్వేచ్ఛను కోల్పోయామని రాష్ట్ర ప్రజలు కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల పంపిణీ బంద్ చేశారు. కానీ మేము మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.1 లక్ష ఇవ్వబోతున్నామన్నారు.
గిరిజన ఆదివాసులు అడవులను తమ తల్లిగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. వలస పాలకులు, గిరిజనులపై ప్రేమలేని వ్యక్తులు అడవుల నుంచి గిరిజనులను దూరం చేసే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికోసం తెచ్చిన చట్టాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మిగతావారితో పాటు గిరిజనులు పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.ఈ దేశంలో హక్కుల కోసం పోరాటం చేయడానికి కావాల్సిన ధైర్యం, స్వేచ్ఛను ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. గిరిజనుల కోసం తీసుకువచ్చిన చట్టాలు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు. వాటిని అమలు చేసుకోలేకపోతే అది మన దౌర్భాగ్యం అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ.. 2026 నాటికి 20 వేల మంది సైనికులను తయారు చేస్తామన్నారు.
బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ జనాభాకు తగ్గకుండా 10 శాతానికి తగ్గకుండా నిధుల కేటాయింపులు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttham kumar Reddy)రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారే తప్ప వాటికి మౌలిక సదుపాయాల కల్పన విషయాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి తండాలో పంచాయతీ భవనం, స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. వైద్యసదుపాయానికి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. 2029లో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ (Rahul Gandi) ప్రధాని కాబోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు, గిరిజనులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. బడుగులు బలహీన వర్గాల హక్కుల కోసం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy venkat Reddy) అన్నారు. ఆదివాసీలతో కాంగ్రెస్ పార్టీకి పేగుబంధం అన్నారు.






