- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APHMEL ప్రపంచంతో పోటీపడాలి.. విజయవాడలో సంస్థను పరిశీలించిన భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ప్రపంచంతో పోటీ పడే స్థాయికి (APHMEL)ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి (APHMEL)ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్‌ను సింగరేణి సీఎండీ బలరామ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు ఏపీహెచ్ఎంఈఎల్ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని భట్టి విక్రమార్క అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన ఉంటే.. మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు.
ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని తెలిపారు. వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పని చేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చు అని పేర్కొన్నారు. సంస్థను, ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలని, యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలని, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు.
కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందన్నారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్‌కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మత్తు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకొని బీహెచ్ఈఎల్ మాదిరిగా ఏపీహెచ్ఎంఈఎల్ పనిచేస్తుందని తెలిపారు. ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.






