తాడిచర్ల–2 సింగరేణికి కేటాయించడం హర్షనీయం

by velandi.Saikiran |

తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణికి కేటాయిస్తూ కిషన్ రెడ్డి ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వానికి భట్టి ధన్యవాదాలు తెలిపారు.

తాడిచర్ల–2 సింగరేణికి కేటాయించడం హర్షనీయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించి తాడిచర్ల బ్లాక్ సింగరేణికి కేటాయించారని, ఇది సింగరేణి సంస్థ మనుగడకు ఎంతో దోహద పడుతుందన్నారు. సింగరేణి ప్రాంతంలో ఇతర బొగ్గు బ్లాక్ లను కూడా సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు సాధించకుండా మూలనపడిన ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్కు తమ ప్రత్యేక చొరవతో పూర్తి అనుమతులు సాధించామని, అక్కడికి వెళ్లి స్థానికులను ఒప్పించి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామన్నారు.

తాజాగా తాడిచర్ల 2 బ్లాక్ కూడా సాధించామని, సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ పట్ల ప్రజా ప్రభు త్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ తాడిచర్ల ఓపెన్ కాస్టు -2 గని సింగరేణికి ఒక వరంగా భావించవచ్చు. ఈ గనిలో 434.14 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా వీటిలో 340 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈప్రాంతంతో మేలైన జీ-9 రకం బొగ్గు లభించనుంది.

ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. భూపాలపల్లి ప్రాంతానికి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. రైలు, రోడ్డు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. రాష్ట్ర పారిశ్రామిక, విద్యుత్ రంగాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కలుగుతుంది.సింగరేణి భవిష్యత్ విస్తరణకు ఈ బ్లాక్ కీలకంగా నిలుస్తుంది. సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడనుందన్నారు.

Next Story