ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Naga Rani Yarlagadda |

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X
  • లీకేజీలను అరికట్టి, బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి
  • రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో భట్టి విక్రమార్క

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన 'రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ' (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలన్నారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర క్యాబినెట్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. మే 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్ ధరలు) అమలులోకి రానున్నాయని అధికారులు మంత్రులకు వివరించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన 'హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్' సిద్ధమయ్యాయని, వీటికి సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే వెలువడనున్నాయని అధికారులు మంత్రులకు చెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story