- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి.. మోడీ పర్యటన వేళ భట్టి విక్రమార్క డిమాండ్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించిందని భట్టి విక్రమార్క విమర్శించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆ హోదా ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్రం కొర్రీలు పెడుతోందని, నిధుల విడుదలలో జాప్యం చేస్తూ రైతులను మోసం చేస్తోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. కేవలం కొన్ని పంటలకే మద్దతు ధర ఇచ్చి తప్పించుకోకుండా, రాష్ట్రం సేకరించిన ప్రతి గింజను కేంద్రమే సేకరించి, సకాలంలో నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ వ్యర్థాలతో అదనపు ఆదాయం:
వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే వరి గడ్డి నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నామని భట్టి తెలిపారు. పంట కోతల తర్వాత గడ్డిని కాల్చడం వల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతోందని, దీన్ని నివారించేందుకు బయో గ్యాస్ ప్లాంట్లు ఉపయోగపడతాయన్నారు. గడ్డిని కాల్చకుండా ప్లాంట్‌లకు సరఫరా చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులు కేవలం వరి మీదనే ఆధారపడకుండా లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్, ఉద్యానవన పంటలు, చిరుధాన్యాల సాగుతో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. పాత పద్ధతులు వదిలి ఆధునిక సాగు విధానాలను అవలంబిస్తేనే వ్యవసాయం పండుగలా మారుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం, పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుందని, ఈ మార్పులో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు.






