జనవరి 15 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తాం: భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

జనవరి 15 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

జనవరి 15 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తాం: భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో 2,600 మంది విద్యార్థులు చదువుకునేల వసతులు కల్పిస్తున్నామని అన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో ముందు వెళ్తోందని చెప్పారు.

దేశంలో ఉత్తమ గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్రంగా తెలంగాణ ఉందని, జనవరి 15 నాటికి (Yadadri Power Plant) యాదాద్రి పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లో విద్య, వైద్య సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంటు అంటేనే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. రెప్పపాటు కూడా విద్యుత్‌ పోకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పడు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని అన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ థర్మల్ ప్రాజెక్ట్‌లో తాతల కాలం నుంచి వచ్చిన భూమిని త్యాగం చేసిన వారు ఉన్నారని, వారి త్యాగాన్ని వెలకట్టలేమని కొనియడారు. ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మేము ఇస్తున్న ఉద్యోగ నియామక పత్రాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఉద్యోగాలు ఇచ్చి,నియామక పత్రాలు ఇస్తామంటే మేము ఏమైనా అడ్డుకున్నామా? అని ప్రశ్నించారు. మీరు ఇవ్వలేదు కాబట్టి.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక చొరవతో నేడు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకుంటున్నామని అన్నారు. దాదాపు 335 రైతు కుటుంబాలకు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

Next Story