బయటపడ్డ ‘భారతి బిల్డర్స్’ అక్రమాలు.. టీజీ ‘రెరా’ కఠిన చర్యలు

by Gantepaka Srikanth |

డ్చల్ జిల్లా కొంపల్లిలోని “భారతీ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్” ప్రాజెక్టులో అక్రమాలు రుజువయ్యాయి.

బయటపడ్డ ‘భారతి బిల్డర్స్’ అక్రమాలు.. టీజీ ‘రెరా’ కఠిన చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని “భారతీ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్” ప్రాజెక్టులో అక్రమాలు రుజువయ్యాయి. దానికి సంబంధించిన భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కఠిన చర్యలు తీసుకుంది. కొనుగోలుదారులు దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అథారిటీ, బిల్డర్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. 2021లో ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో నిధులు వసూలు చేసిన ప్రమోటర్ గా తేల్చారు. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారు. కనీస చట్టబద్ధమైన అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే నిధులు సేకరించడం, ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కొనుగోలుదారులు ఆ ప్రాజెక్టులో కొనసాగాల్సిన అవసరం లేదని అథారిటీ స్పష్టం చేసింది. బాధితులు చెల్లించిన పూర్తి మొత్తాన్ని తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్-2017 (రూల్ 15) ప్రకారం వడ్డీతో కలిపి 60 రోజుల్లో వాపసు చేయాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వాములైన మరో శ్రీ భారతి అనే సంస్థను సైతం ప్రమోటర్లుగా పరిగణించారు. ఈ సంస్థలన్నీ ఉమ్మడిగా ఈ నగదును చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను "డిఫాల్టర్ ప్రమోటర్‌గా ప్రకటించారు. దాంతో పాటు రూ.3,55,63,297 భారీ జరిమానాను విధించింది. గతంలో ఇవే ఉల్లంఘనలకు సంబంధించి విధించిన రూ.1,18,54,432 కోట్ల జరిమానాకు ఇది అదనమని పేర్కొంది. అంటే మొత్తం పెనాల్టీ 4,74,17,729 గా తేలింది.

ప్రీలాంచ్ నిషేదం..

రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో 'ప్రీ-లాంచ్' ఆఫర్లు లేదా స్కీమ్‌లు చట్టం ప్రకారం పూర్తిగా నిషేదమని మరోసారి అధికారులు స్పష్టం చేశారు. అలాంటి స్కీంలను నమ్మొద్దని, పథకాల్లో పాల్గొనవద్దని కొనుగోలుదారులను తెలంగాణ రెరా హెచ్చరించింది. ఇటువంటి స్కీమ్‌ల ద్వారా రియల్ ఎస్టేట్ చట్టం ద్వారా లభించే కీలక రక్షణలను కొనుగోలుదారులు కోల్పోతారు. రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టు నిర్మాణంలో అథారిటీ పర్యవేక్షణ ఉండదు. ప్లానింగ్ అథారిటీ వద్ద ప్రాజెక్టు విస్తీర్ణంలో 10% విస్తీర్ణాన్ని మార్టిగేజ్ (తనఖా) చేయడం ద్వారా లభించే నియంత్రణ రక్షణలు, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులకు వర్తించే 'ఎస్క్రో' ప్రత్యేక బ్యాంకు ఖాతా నిబంధనల వంటి ఆర్థిక భద్రతలను కూడా కొనుగోలుదారులు పొందలేరని పేర్కొన్నది. అందువల్ల, కొనుగోలుదారులు ఏదైనా లావాదేవీ చేసే ముందు, సదరు ప్రాజెక్టు యొక్క రిజిస్ట్రేషన్ ను అధికారిక పోర్టల్‌ (https://rera.telangana.gov.in)లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని అథారిటీ స్పష్టం చేసింది.

Next Story