జాగ్రత్త.. సమోసాలను ఇష్టంగా తింటున్నారా? హైదరాబాద్‌లో కల్తీ సమోసాల గుట్టురట్టు

by Ramesh Naini |   (  Updated:2026-03-21 07:52:20  IST  )

మీరు బయట దొరికే వేడి వేడి సమోసాలను ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ వార్త చదివిన తర్వాత మీరు రెండోసారి ఆలోచించక తప్పదు.

జాగ్రత్త.. సమోసాలను ఇష్టంగా తింటున్నారా? హైదరాబాద్‌లో కల్తీ సమోసాల గుట్టురట్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో/కార్వాన్: మీరు బయట దొరికే వేడి వేడి సమోసాలను ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ వార్త చదివిన తర్వాత మీరు రెండోసారి ఆలోచించక తప్పదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్న ఒక భారీ అక్రమ కేంద్రాన్ని హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్స్ వేదికగా తెలిపిన ప్రకారం.. జియాగూడ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సమోసాలు తయారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, కుల్సుంపురా పోలీసులు, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో వెలుగుచూసిన నిజాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి.

షాకింగ్ నిజాలు ఇవే..

సమోసాల తయారీలో కుళ్ళిపోయిన ఉడికించిన గుడ్లను, పదే పదే వాడిన కలుషిత నూనెను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ రషీద్ (73) వద్ద ఎటువంటి FSSAI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, కనీసం ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ గానీ లేవు. ఈ తయారీ కేంద్రం అత్యంత మురికిగా, కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకుండా నడుస్తోంది.

రూ. 5 లక్షల విలువైన సామాగ్రి సీజ్

ఈ సోదాల్లో సుమారు రూ. 5 లక్షల విలువైన కలుషిత ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో భారీగా నిల్వ ఉంచిన సమోసాలు, మైదా పిండి, స్వీట్ కార్న్, యంత్రాలు ఉన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Next Story