- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమలపాకు కూడా యమా కాస్ట్లీ గురూ..!
మార్కెట్‌లో తమలపాకుల ధరలు చుక్కలు చూస్తున్నాయి. శుభకార్యాలు, పూజలు, తాంబూలాల్లో తప్పనిసరిగా వాడే తమలపాకుల ధర ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులతో పాటు పాన్ షాపుల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేవుడి పూజకైనా, శుభకార్యానికైనా.. తాంబూలం ఉండాల్సిందే. ఎన్ని ఆకులున్నా తమలపాకుకే అక్కడ అగ్రస్థానం. ఎంతో చవకగా దొరికే తమలపాకుల ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. కారణం.. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడమేనని, పంట తగ్గడానికి కారణం వర్షాభావ పరిస్థితులేనని సాగుదారులు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రూ.60 ఉండే తమలపాకు ఒక కట్ట ధర.. ఇప్పుడు రూ.200కు చేరుకుంది. ఇది సాదా ఆకుల ధర మాత్రమే. పండుగలు, శుభకార్యాలకు వాడే ప్రసిద్ధ కలకత్తా ఆకు ధర డబుల్ అయింది. ఒక్క వరంగల్ జిల్లాలోనే రోజుకు రూ.10 లక్షల వ్యాపారం జరిగేది. కానీ ఇప్పుడు రేట్లు పెరగడంతో వ్యాపారం తగ్గిందని వ్యాపారస్తులు వాపోతున్నారు.
వర్షాభావ పరిస్థితులు.. తగ్గిన సాగు
ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులేనని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో పడకపోవడం, నీటి లభ్యత తగ్గడంతో తమలపాకు సాగు భారీగా తగ్గింది. గత ఐదు నెలలుగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మార్కెట్‌కు వచ్చే సరుకు సగానికి పైగా పడిపోయింది. దిగుబడి లేకపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా తమలపాకుల వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, స్థానిక దిగుబడి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్లకు పశ్చిమ బెంగాల్ (కలకత్తా), కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తమలపాకులు దిగుమతి అవుతున్నాయి. రవాణా ఖర్చులు కూడా తోడవడంతో ఈ ధరల భారం మరింత పెరిగిందని, రానున్న రోజుల్లో దిగుబడులు పెరిగితే తప్ప ధరలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.






