ఎస్సెస్సీ ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన గురుకులాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు 2026 పదవ తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయి. మొత్తం 17,071 మంది పరీక్షలకు హాజరుకాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఎస్సెస్సీ ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన గురుకులాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు 2026 పదవ తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయి. మొత్తం 17,071 మంది పరీక్షలకు హాజరుకాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ ఫలితాలు సాధించడం గురుకులాల విద్యా ప్రమాణాలను మరింత పెరిగాయనడానికి నిదర్శనమన్నారు. గురువారం డీఎస్ఎస్ భవన్ లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇవి కేవలం ఫలితాలు కాదని, వ్యవస్థాత్మక మార్పులు, నిరంతర పర్యవేక్షణ, ప్రభుత్వ సంకల్పం, వ్యూహాత్మక సంస్కరణల సమిష్టి ఫలితమని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకులాలను నూతన దిశగా తీసుకెళ్తున్నామని వెల్లడించారు.

ఫలితాల్లో రికార్డు సృష్టించాం..

ఫలితాల్లో రికార్డు సృష్టించామని, 235 ఇనిస్టిట్యూషన్లలో 163 పాఠశాలలు 100% ఉత్తీర్ణత, 9 జిల్లాల్లో అన్ని గురుకులాల్లో 100% ఫలితాలు సాధించాయని మంత్రి చెప్పారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో 88.22% ఉత్తీర్ణత, 41 కాలేజీల్లో 100%, ఇంటర్ మొదటి సంవత్సరంలో 77.79% ఉత్తీర్ణత, 12 కాలేజీల్లో 100%, జేఈఈ మెయిన్స్‌లో 441 మంది అర్హత, 35 మంది 90 పర్సెంటైల్ పైగా, ఐఐటీ, జేఈఈఈ, నీట్ లో కూడా మెరుగైన ఫలితాల సాధించామని లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.

ఎస్సీడీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ హాస్టల్లో ఉత్తీర్ణత శాతాన్ని వివరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్....

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలోని 63 ప్రీమెట్రిక్ వసతి గృహాల నుంచి 8060 విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాడా 7666 మంది ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణత శాతం 95.11% అని మంత్రి పేర్కొన్నారు. 100% ఉత్తీర్ణత సాధించిన వసతి గృహాలు 369 కాగా 100% ఉత్తీర్ణత సాధించిన జిల్లా ములుగు అని, 91% నుండి 100 % మార్కుల మధ్యలో 195 మంది విద్యార్థులు, 81 % నుండి 90% మార్కుల మధ్యలో 1416 విద్యార్థులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఎస్సీ వసతి గృహంలో అత్యుత్తమ మార్కులు 581 నమోదయిందని సంగారెడ్డి జిల్లాకు చెందిన రామావత్ మల్లేశ్వరి ఈ మార్కులు సాధించారని, రెండవ స్థానాల్లో ముగ్గురు విద్యార్థులు 579 మార్కులు సాధించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇక గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 26 పాఠశాలలో 124 పాఠశాలలో 100% రిజల్ట్స్ సాధించినట్లు మంత్రి వెల్లడించారు.

అకడమిక్ సంస్కరణలు ..

డేటా ఆధారిత విధానంబేసిక్ టు అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ మోడల్ సబ్జెక్ట్ వారీ మైక్రో ప్లానింగ్ స్టూడెంట్ & టీచర్ వైజ్ అనాలిసిస్, పర్ఫార్మెన్స్ డ్యాష్‌బోర్డ్స్, వెంటనే కరెక్టివ్ యాక్షన్, ఉపాధ్యాయుల అంకితభావం, ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ 24 గంటలు అందుబాటులో ఉండి బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మంత్రి ప్రశంసించారు. టీచర్లకు ట్రైనింగ్స్, వర్క్‌షాప్స్, ఫలితాల ఆధారంగా రివ్యూ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థైర్యం విద్యా ఫలితాల్లో కీలకమని గుర్తించి మెస్ ఛార్జీలను పెంచి ప్రోటీన్ రిచ్ డైట్ అందిస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హాజరు పెరగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంచేందుకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్లుగా ఆయన చెప్పారు. ఆధునిక హాస్టల్ సదుపాయాలు డిజిటల్ క్లాస్‌రూమ్స్ సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. డైట్, కాస్మోటిక్ బిల్లులు మార్చి 31 నాటికి క్లియర్ చేశామని, ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి లక్ష్మణ్​కుమార్ తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై ప్రత్యేక చొరవ తీసుకున్నామన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాచి ఘోష్, గిరిజన శాఖ డైరెక్టర్, ఇంచార్జ్ కమిషనర్ సంతోష్, టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ జాయింట్ సెక్రెటరీ బానోతు గీత, అడిషనల్ సెక్రటరీ (అకాడమిక్) సక్కు నాయక్, ఆశ్రమ పాఠశాల డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు చెందిన జోనల్ ఆఫీసర్లు, ఆర్సీఓలు, వివిధ పాఠశాలలు కళాశాలలు చెందిన ప్రిన్సిపల్స్, ఎస్సెస్సీ, ఇంటర్, జేఈఈ మెయిన్స్ లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story