ధాన్యం కొనుగోళ్లలో బినామీల హవా.. చక్రం తిప్పుతోన్న అధికార పార్టీ నేతలు

by Kema Shiva Kumar |

యాసంగి సీజన్​కు సంబంధించి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది.

ధాన్యం కొనుగోళ్లలో బినామీల హవా.. చక్రం తిప్పుతోన్న అధికార పార్టీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్​కు సంబంధించి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం.. మహిళా సంఘాలు, పీఏసీఎస్ లకు అప్పగించింది. ఈ కేంద్రాల నిర్వహణపై బినామీలు కన్నేశారు. గత వానాకాలం సీజన్​లో కూడా నిర్వహణ పేరు మహిళా సంఘాలది అయితే పెత్తనం బినామీలుగా ఉన్న నిర్వాహకులే చెలాయించారు. మహిళా సంఘాల ప్రతినిధులను కేంద్రాలలో కూలీలుగా పెట్టి రోజువారీ కూలీ ఇచ్చేవారు. ఈ సారి కూడా అదే ప్రణాళికతో బినామీలు మహిళా సంఘాలతో తీర్మానాలు పొందేందుకు లోపాయికారి ఒప్పందాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే కేంద్రాలు కేటాయింపులు జరుగుతున్నట్లు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,209 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసి 2100 సెంటర్లు తెరచి రైతులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 1.05 లక్షల మెట్రిక్​టన్నులు కొనుగోలు చేసింది. దశల వారీగా పలు జిల్లాల్లో మిగతా కేంద్రాలు ప్రారంభించి జూన్ 30 వరకు కొనుగోలు చేపట్టనుంది. రాష్ట్రంలో 1.37 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 70 లక్షల మెట్రిక్​టన్నులు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ టార్గెట్​పెట్టుకుంది.

ధాన్యం సేకరణలో మోసాలు

బస్తాకు హమాలీ ఖర్చులు వసూలు చేయడం నుంచి మిల్లులో ధాన్యం దించే వరకు దోపిడీ జరుగుతోందనే ఆరోపణలున్నాయి. రైతు నుంచి హమాలీ తీసుకునేది ఓ లెక్క వారికిచ్చేది మరో లెక్కగా ఉంది. ధాన్యం తూకంలో సాంకేతికతను ఉపయోగించి ఒక్కో బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకు అదనంగా తీసుకుంటారు. ధాన్యం మిల్లులో దించే ముందు వేబ్రిడ్జి తూకం వేసి కొనుగోలు చేసిన ధాన్యం రసీదులో ఉన్నదాని కంటే ఎక్కువగా చూపిస్తే అక్కడే మిల్లర్లకు అమ్మకాలు చేసి సొమ్ము ఇద్దరు పంచుకుంటారు. తర్వాత బినామీ రైతుల పేరుతో ధాన్యం కొనుగోలు చేసినట్లు పట్టా పాసు బుక్​లు తీసుకుంటారు. మిలర్ల సహకారంతో డిఎస్ఓ కార్యాలయంలో వాటిని నమోదు చేయిస్తారు. వచ్చే బోనస్ సొమ్మును మిల్లర్లు, రైతు, నిర్వా హకుడు దర్జాగా జేబులో వేసుకుంటారు. ఈ విధంగా ధాన్యం సేకరణలో అనేక మోసాలు జరుగుతున్నాయి.

బినామీ ఆదేశాల ప్రకారమే తూకం

ధాన్యం సేకరణ కేంద్రాల్లో పెత్తనమంతా అధికార పార్టీ నేతలదే. వారు చెప్పినట్టే ఎప్పడు తూకం వేయాలంటే అప్పడే వేయాలి. ముందుగా అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల నాయకులు ధాన్యం తీసుకొస్తే సాయంత్రంలోగా తూకం వేయాల్సిందే. వారికి తాలు, తరుగు, పచ్చి ధాన్యం అని సాకులు చెప్పొద్దు. అలాగే ఇతర రైతులు వస్తే ధాన్యం పచ్చిగా ఉందని రెండు రోజుల ఆరబెట్టాలని, బస్తాకు రెండు కిలోల తరుగు పేరుతో కోతలు పెడుతున్నారు. అధికారులు సైతం దొడ్డు, సన్న ధాన్యం గుర్తింపులో తేడాలుంటే బినామీలు చెప్పిన వారికి నిర్దారణ చేసి వెంటనే బోనస్​రూ. 500 ఖాతాలో పడేలా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story