- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: ఆ లోపు బీసీ రిజర్వేషన్ ఫైనల్? కసరత్తు చేస్తున్న డెడికేటెడ్ కమిషన్
ఈనెల 15లోపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ శాతాన్ని ఫైనల్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 15లోపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ శాతాన్ని ఫైనల్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రాథమిక రిపోర్టును బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు అందించినట్టు సమాచారం. సర్వేలో వెల్లడైన బీసీ జనాభా ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై డెడికేటెడ్ కమిషన్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అదే టైంలో వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత మేరకు ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు పంచాయతీ రాజ్ శాఖ సైతం కసరత్తులో వేగం పెంచింది.
యుద్ధ ప్రాతిపదికన..
ఈనెల 2న ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సమగ్ర కుటుంబ సర్వే (కులగణన) రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. ప్రభుత్వం వెంటనే ప్రాథమిక రిపోర్టును బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు అందించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరినట్టు సమాచారం. దీనిలో భాగంగానే కమిషన్ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఏయే జిల్లాల్లో ఎంత శాతం మంది బీసీలు ఉన్నారు? ఎక్కడ ఆ సామాజిక వర్గానికి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు? ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండే జిల్లాలు, మండలాల్లో ఎంతమేరకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు? అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈనెల 15లోపు బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసి, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఒకటికి రెండు సార్లు అన్ని కోణాల్లో చెక్ చేసుకుని నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
వేర్వేరుగా రిజర్వేషన్లు..
గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు వేర్వేరుగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా డెడికేటెడ్కమిషన్ కసరత్తు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీల జనాభా అధికంగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే చాన్స్ ఉండటంతో వేరువేరుగా నివేదికల తయారు చేసి ఇవ్వాలని కమిషన్ నిర్ణయించుకున్నది. దీంతో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జనాభాకు న్యాయం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. దీంతో వాటికి సంబంధించిన నివేదికను వెంటనే ఇవ్వనున్నది. అనంతరం పట్టణ ప్రాంత రిజర్వేషన్లపై రిపోర్ట్ అందించనున్నది.
బీసీలకు 7 నుంచి 8 జడ్పీలు?
గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ప్రధానంగా జిల్లా పరిషత్‌లలో 7 నుంచి 8 స్థానాలు బీసీలకు రిజర్వ్ కానున్నట్టు సమాచారం. మిగిలిన వాటిల్లో ఎస్సీ, ఎస్టీలకు కలిపి 8 వరకు రిజర్వ్ కానున్నాయి. మరో 16 జనరల్‌గా ఉండనున్నాయని సమాచారం. వీటిలోనే మహిళా రిజర్వేషన్లు సైతం అమలు కానున్నాయి. వీటికి సంబంధించిన కసరత్తు ప్రాథమికంగా జరిగినట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ల సంఖ్యపై ప్రాథమికంగా ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. వీటి లెక్కలు, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది. రాష్ట్ర స్థాయిలో ఏ వర్గాలకు ఎన్ని స్థానాలు అనేదానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని జిల్లా కలెకర్టర్లకు పంపిస్తారు. అనంతరం మండలాల వారీగా రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేస్తారు.






