సస్పెన్స్‌లో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌..! గవర్నర్‌దే తుది నిర్ణయం

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వైఖరి ఎలా ఉంటుంది?

సస్పెన్స్‌లో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌..! గవర్నర్‌దే తుది నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వైఖరి ఎలా ఉంటుంది? ఆర్డినెన్స్‌పై ఆయన సంతకం చేస్తారా? లేకపోతే వెనక్కి పంపుతారా? లేదంటే తన వద్దే పెండింగ్‌లో పెడతారా? అనే చర్చ మొదలైంది. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రాజకీయంగా, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. వాటిపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్తగా పంచాయతీ రాజ్ చట్టం–2018ను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.

గవర్నర్ నిర్ణయం ఏంటి?

కులగణన ప్రకారం బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించింది. వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో పెట్టాలని కేంద్రాన్ని కోరింది. దీనితో ఆ బిల్లులు రెండింటినీ గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ, ఇంతవరకు రాష్ట్రపతి వాటిని ఆమోదించలేదు. అలాగని తిరస్కరించలేదు. దీంతో పంచాయతీ రాజ్‌–‌2018 చట్టంలోని రూల్ 285Aను సవరించి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ముందుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఆ ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని చర్చ మొదలైంది. వెంటనే తుది నిర్ణయం తీసుకుంటారా? లేక న్యాయ సలహాలు తీసుకున్నాకే ఓ నిర్ణయానికి వస్తారా? అనే చర్చ జరుగుతున్నది. కానీ, ఆర్డినెన్స్‌లో న్యాయ, రాజకీయ అంశాలు ఉన్నందున అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఆయన తుది నిర్ణయానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు.

బీజేపీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా?

రాజకీయపరమైన అంశాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటారని టాక్. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌పై గవర్నర్ స్వతహాగా నిర్ణయం తీసుకుంటారా? లేక కేంద్ర బీజేపీ నాయకుల సలహా మేరకు ముందుకు వెళ్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఢిల్లీ నాయకత్వం గైడెన్స్ ప్రకారం గవర్నర్ బిల్లును రిజక్ట్ చేసినా, ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టినా ఆ ప్రభావం రాష్ట్ర బీజేపీపై పడటం ఖాయం. ఎందుకంటే బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఎటాక్ చేయనుంది. దీంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.

కోర్టుల్లో చాలెంజ్ చేస్తే ఎలా?

ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించినా కోర్టులో ఎవరైన చాలెంజ్ చేస్తే ఎంటీ? అనే ఆందోళన అధికారుల్లో నెలకొన్నది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. ఎవరైన ఆర్డినెన్స్‌ను చాలెంజ్ చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.

కొత్త సిఫారసులు చేయండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం డెడికేషన్ కమిషన్ నుంచి కొత్త సిపారసులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం డెడికేషన్ కమిషన్‌కు కొత్త విధివిధానాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. కులగణన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా సిఫారసులు ఉండాలని, అందులో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో కమిషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన విధివిధానాల్లో రిజర్వేషన్లు 50 శాతంలోపు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. దీనితో కమిషన్ సమర్పించిన రిపోర్టులో బీసీలకు కేవలం 22 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సిఫారసు చేసింది. అందుకని మళ్లీ కొత్తగా రికమెండేషన్ తీసుకుని, ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, హైకోర్టు ఇచ్చిన గడవులోపు రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదానికి ఇబ్బందులు వస్తే ఆ విషయాన్ని కోర్టుకు వివరించి మరింత గడువు కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Next Story