మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పిడిగుద్దులు.. నిధుల గోల్‍మాల్‍పై ఘర్షణ

by Prasad Jukanti |   (  Updated:2026-04-11 12:22:27  IST  )

రవీంద్ర భారతిలో పూలే జయంతి వేడుకలు రణరంగంగా మారాయి. నిధుల పంపిణీపై నాయకులు వర్గాలుగా విడిపోయి పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పిడిగుద్దులు.. నిధుల గోల్‍మాల్‍పై ఘర్షణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి (Phule Jayanti) వేడుకలు రవీంద్ర భారతి (Ravindra Bharati) వేదికగా రణరంగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అధికారిక వేడుకల్లో బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూలే ఆశయాలను స్మరించుకోవాల్సిన చోట నాయకులు ఇలా పిడిగుద్దులు గుద్దుకోవడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం జయంతి వేడుకలకు కేటాయించిన నిధుల వినియోగంపై మొదటి నుంచీ బీసీ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో నిధుల కేటాయింపులో, ఖర్చు చేయడంలో భారీగా అవినీతి జరిగిందని ఒక వర్గం ఆరోపించడంతో గొడవ మొదలైంది. ముఖ్యంగా ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్,జేరుపోతుల నరేంద్ర వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుందని ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

పూలే అభిమానుల అసహనం

దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల చైతన్యం కోసం పోరాడిన జ్యోతిరావు పూలే జయంతి రోజే ఇలాంటి ఘటనలు జరగడంపై పూలే అభిమానులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంఘాల మధ్య సఖ్యత లేకపోవడం, ఐక్యతను పక్కనపెట్టి నిధుల కోసం, ఆధిపత్యం కోసం కొట్టుకోవడం బీసీ ఉద్యమాన్ని దెబ్బతీస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. పూలే లాంటి మహనీయుడికి ఇది ఇచ్చే గౌరవం కాదని హితవు పలికారు. అయితే పూలే జయంతి రోజు గందరగోళం ఇదేం కొత్త కాదు. మూడేళ్ల క్రితం ఇదే రవీంద్ర భారతిలో పూలే జయంతి వేడుకల్లో అవార్డులు, శాలువాల కోసం బీసీ నేతలు కీచులాడుకోగా, పూలే విగ్రహానికి పూల మాల వేసేందుకు నేతలు పోటీ పడగా వేదికపై ఏర్పాటు చేసిన విగ్రహానికి పూల మాల వేసేందుకు విగ్రహాన్ని అటు ఇటు లాగడం తీవ్ర విమర్శలపాలు చేసింది.

Next Story