తొలగించబడ్డ 26 కులాలపై బీసీ కమిషన్​ విచారణ

by Muthe.Rajitha |

తొలగించబడిన 26 కులాల విషయంలో తెలంగాణ బీసీ కమిషన్ ఈనెల 9, 10, 11 తేదీలలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.

తొలగించబడ్డ 26 కులాలపై బీసీ కమిషన్​ విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొలగించబడిన 26 కులాల విషయంలో తెలంగాణ బీసీ కమిషన్ ఈనెల 9, 10, 11 తేదీలలో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన గురువారం బీసీ కమిషన్ కార్యాలయంలో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల వివరాల సేకరణ పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గడువులోగా సమాచారం సమర్పించనటువంటి వివిధ శాఖల కార్యదర్శులతో కమిషన్ ఛైర్మన్​నిరంజన్​చర్చించారు. ఈ విషయంలో సుప్రీం కోర్ట్​ కు కమిషన్ నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉన్నందున తొలగించిన కులాల విషయంలో కులగణనలో నమోదైన జనాభా , సామాజిక ఆర్థిక, విద్య పరంగా వెనుకబాటుతనం వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని కమిషన్ నిర్ణయించిందని నిరంజన్ తెలిపారు.

నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ గ్రామంలో గత నెల వెలుగులోకి వచ్చిన బీసీల గ్రామ బహిష్కరణ అంశంలో నిజామాబాద్ కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించి జిల్లా యంత్రాంగం స్పందించిన తీరును కమిషన్ ప్రశంసించిందని తెలిపారు. కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చవలసిన నలభై కులాల విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింనట్లు నిరంజన్​ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాల లక్ష్మి, బాల మాయ దేవి , సభ్య కార్యదర్శి శ్రీనివాసరావు ,డిప్యూటీ డైరెక్టర్ సతీష్ కుమార్ , స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Next Story