- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఉద్యోగుల వివరాల సేకరణ.. ఈ నెల 15న డెడ్‌లైన్.. అధికారులకు బీసీ కమిషన్ కీలక ఆదేశాలు
తెలంగాణ బీసీ కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీసీ కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరింది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ విభాగంలో ఉద్యోగుల వివరాలను తెలంగాణ బీసీ కమిషన్ (BC Commission)కు పంపినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో సమస్యలను అధిగమించేందుకు కమిషన్ ఆయా అధికారులకు తగిన సూచనలు చేస్తోంది. తమకు ఇచ్చే సమాచారం సూచించిన ఫార్మాట్లో లేక పోవడంతో వారికి సమాచార సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిసింది. బీసీ కమిషన్ ప్రధానంగా డిపార్ట్మెంటల్లోని ఉద్యోగుల వివరాలు, మంజూరైన పోస్టులు, ఎంప్లాయిస్సంఖ్య, ఖాళీగా ఉన్న పోస్టులు, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాల వివరాలను అందివ్వాలని కోరింది. ఇప్పటి వరకు విద్యుత్ శాఖ నుంచి పూర్తి సమాచారం కమిషన్కు చేరినట్లు తెలిసింది. కాగా, తెలంగాణలోని వివిధ డిపార్టమెంట్లలో పని చేస్తున్న ఉద్యోగుల సమాచారం ఈ నెల 15 లోపు ఇవ్వాలని బీసీ కమిషన్ ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కోరింది. రాష్ట్రంలోని 33 శాఖలకు సంబంధించిన సెక్రటరీలు, ఉన్నతాధికారులతో సమావేశమైన కమిషన్వారికి అనేక సూచనలు చేసింది. తెలంగాణలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలను సేకరించాలని నిర్ణయించిన బీసీ కమిషన్ దానికి తగ్గ కార్యాచరణ తీసుకొని పనిచేస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకు లేఖ రాసి వివరాలు అందించాలని కమిషన్ కోరింది.
తమ దృష్టికి సమస్యలు తీసుకువచ్చారన్న కమిషన్
ఇటీవల ఉన్నతాధికారులతో కమిషన్ సమావేశం నిర్విహించినప్పుడు కమిషన్ అనేక అంశాలను వారికి తెలియపరిచింది. ప్రధానంగా తాము క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు అనేక సమస్యలు, విజ్ఞాపనలు, సూచనలు ఆయా సామాజిక వర్గాల నుంచి తమ దృష్టికి వచ్చాయని కమిషన్ తెలిపింది. చిన్న కులాల వారు అనేక అంశాలు తమతో చెప్పుకున్నాయని కమిషన్ తెలిపింది. రిజర్వేషన్ల ఫలాలు తమ దాకా రావడం లేదని, కొన్ని పెద్ద కులాల వారే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని వారు చెప్పారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాము ప్రభుత్వంలోని ఉద్యోగుల వివరాలు సేకరించి, వారిలో సామాజిక వర్గాల వారీగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం భవిష్యత్లో అందరికీ సమానంగా సమ న్యాయం చేసే అవకాశం ఉంటుందని కమిషన్అధికారులకు వివరించింది. దీని ద్వారా బీసీ ఉద్యోగుల వివరాలు, రిజర్వేషన్ల అమలుకు చర్యలు, ప్రమోషన్లు, మరింత భద్రతకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని కమిషన్తెలియజేసింది.
ఉద్యోగుల వివరాల సేకరణ మన రాష్ట్రమే ప్రధమం : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యంగా తాము ఉద్యోగుల వివరాల సేకరణ చేయాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తమకు అందిన డేటాను నివేదికగా రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని తద్వారా అన్ని బీసీ కులాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇలా ఉద్యోగుల వివరాలను సేకరించే ప్రక్రియ దేశంలోనే మొదటిదని ఆయన చెప్పారు. ఉద్యోగ అవకాశాలు రాని సామాజిక వర్గానికి ఏ విధంగా తగిన న్యాయం చేయాలో, ఆయా వర్గాలకు మరింత లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయోజనం ఈ ఉద్యోగ వివరాల సేకరణ ద్వారా ఉంటుందని నిరంజన్ చెప్పారు.






