తెరపైకి బీసీ ముఖ్యమంత్రి.. బీజేపీ ప్లాన్ అదేనా?

by Disha Web |
తెరపైకి బీసీ ముఖ్యమంత్రి.. బీజేపీ ప్లాన్ అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ కొత్త ఎత్తుగడలకు ప్లాన్ చేస్తుంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడంలో భాగంగా భారీ స్కెచ్ వేసింది. ఈ నేపథ్యంలో ప్రతి‌సారి రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్ర మంత్రులు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఉరకలెత్తుందని ప్రకటిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో పలు కేంద్ర పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌తో పాటు బీసీ ముఖ్యమంత్రి ఆయుధాన్ని తెరపైకి తెచ్చేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది.

బీసీల జనాభా ఇలా..

కాగా రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 4 కోట్లు ఉండగా ఇందులో బీసీలే అధికంగా ఉన్నారు. బీసీల జనాభా రాష్ట్రంలో మొత్తం కోటి 88 లక్షల వరకు ఉంది. రాష్ట్రంలో బీసీల జనాభా 53.50 శాతంగా ఉంది. ఎస్సీలు 18.48, ఎస్టీలు 11.74, మైనార్టీలు 10.6 శాతం, ఓసీలు 5 శాతం ఉండగా బీసీల ఓటు బ్యాంకు ఆయా పార్టీలకు కీలకంగా మారింది. దీంతో బీసీల ఓటు బ్యాంకుపై కన్నేసిన బీజేపీ 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేయనున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాం అనే నినాదం ప్రజల్లోకి వెళ్లడంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు కలిసిరావడంతో బీసీ ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చింది.

తమ వైపు తిప్పుకునేందుకే..

ఇటీవల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా తాము అధికారంలోకి వస్తే దళితులను లేదా మైనార్టీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఫార్ములాపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. బీసీ ప్రధాని, బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కన్పిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. దళిత వ్యతిరేక పార్టీ ముద్ర నుంచి బయట పడేందుకు రాంనాథ్ కోవింద్‌ను, గిరిజనులకు చేరువేయ్యేందుకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన విషయం తెలిసిందే. ఇలా అన్ని వర్గాలకు చేరువయ్యేలా బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఆయా వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అంశం తమకు కలిసి వస్తుందని కమల నాథులు భావిస్తున్నారు.

Read More: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు..

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed