BC Bandh: రాజకీయ యుద్ధంగా బీసీ బంద్.. నెక్స్ట్ ఏంటి?

by Prasad Jukanti |   (  Updated:2025-10-18 06:25:14  IST  )

తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల అంశంతో అట్టుడుకుతోంది.

BC Bandh: రాజకీయ యుద్ధంగా బీసీ బంద్.. నెక్స్ట్ ఏంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల అంశంతో అట్టుడుకుతోంది. తమ వాటా తమకు దక్కాల్సిందేనంటూ బీసీ జేఏసీ (BC JAC bandh) ఇచ్చిన పిలుపుతో ఇవాళ రాష్ట్రమంతటా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‍కు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచే ఆయా పార్టీలు బీసీ రిజర్వేషన్ల (BC reservations) కోసం రోడెక్కాయి. ఈ బంద్ సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య మొదలైన ఈ డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ యుద్ధంగా మారింది. పార్టీల మధ్య మాటల దాడి దిపావళి బాంబుల కంటే పవర్ ఫుల్‍గా పేలుతున్నాయి. దీంతో ఈ బంద్ ప్రభావం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

పొలిటికల్ వార్ కాస్త క్రెడిట్ వార్ గా..

బీసీ రిజర్వేషన్ల అంశంలో తప్పు మీదంటే మీదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. పరస్పర విమర్శలతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. బీజేపీ కిరికిరి వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్లపై పొలిటికల్ వార్ కాస్త క్రెడిట్ వార్‍గా మారిందనే విమర్శలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇవాళ్టి బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీలు ప్రత్యర్థులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తూ తాము నిజాయితీగానే ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్ని పార్టీలు సానుకూలంగా ఉంటే బీసీ రిజర్వేషన్లకు అడ్డు ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బీసీల వద్ద బద్నాం కాకూడదనే పార్టీలు ఇలా పోటీ పడి మరీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సామాన్య ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెక్స్ట్ ఏంటి?:

ఇవాళ్టి బంద్ తర్వాత పరిణామాలు ఏంటి అనేది రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయం ఏంటో చెప్పాలని ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని కుండబద్దలు కొడుతోంది. బీసీలకు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అని దాన్ని ఆ పార్టీనే సాల్వ్ చేయాలని బీజేపీ, బీఆర్ఎస్‍లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న బంద్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నాయి అనేది సస్పెన్స్ గా మారింది.


Read More..

బీసీ రిజర్వేషన్లపై మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ‌కి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Next Story