- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరవీడి చెరువైంది.. బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం
బతుకమ్మ కుంట తన పేరును సార్థకం చేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ కుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొదలు.. పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉన్న బతుకమ్మ కుంట.. నేడు జలకళతో చూడముచ్చటగా మారింది. కబ్జాల చెరను విడిపించుకుని కనువిందు చేస్తోంది. ఆక్రమణల నుంచి బయట పడి ఆహ్లాదంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇదంతా హైడ్రా చొరవ తోనే సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా మారిన చెరువును చూసి ‘ఇది కలా.. నిజమా..!’ అని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. శుక్రవారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బతుకమ్మలతో ఘన స్వాగతం పలికేందుకు స్థానికులు సిద్ధమయ్యారు.
హైడ్రాకు ప్రేరణగా నిలిచిన బతుకమ్మ కుంట
జలకళతో.. జీవ వైవిధ్యంతో.. చక్కటి పర్యావరణంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించేలా ఈ నగరాన్ని తీర్చి దిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచించే క్రమంలో ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డికి తట్టిన ఆలోచనే హైడ్రా. 2024 జులై 19వ తే దీన హైడ్రా పురుడుపోసుకుంది. నగరంలోని చెరువులు అభివృద్ధి చెందితే వరదలు నివారించవచ్చని బతుక మ్మకుంట నిరూపించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనా థ్ తెలిపారు. ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
వివాదాల నుంచి బయటపడి..
నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేసి.. ఈ చెరువుకు ఆనవాళ్లు లేకుండా కబ్జా రాయుళ్లు ఆక్రమించేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో యెడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మకుంటను హైడ్రా చేపట్టింది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో కలిసి చెరువు చరిత్రను తవ్వి తీసింది. అన్ని విభాగాలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి బతుకమ్మ కుంట చెరువే అని నిర్ధారించుకుంది. భూ కబ్జాదారులైన సయ్యద్ ఆజం, సయ్యద్ జహంగీర్, ఎ.సుధాకర్ రెడ్డి లాంటి వారిచే వేసిన పిటిషన్లపై కోర్టులు పదేపదే ఇది చెరువు భూమేనని స్పష్టం చేశాయి.
రూ.7.15 కోట్లతో అభివృద్ధి
మండు వేసవిలో దాదాపు రూ.7.15 కోట్లతో బతుకమ్మ కుంట పనులను హైడ్రా చేపట్టింది. జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నెంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది.
సర్వాంగ సుందరంగా..
బతుకమ్మకుంట ఇప్పుడు పిక్నిక్ స్పాట్‌గా మారింది. చెరువు అభివృద్ధిని దగ్గరగా పరిశీలించిన స్థానికులు సాయంత్రం అయితే చాలు అక్కడకు చేరుకుని సేదదీరుతున్నారు. పిల్లల ప్లే ఏరియా అందుబాటులోకి వచ్చింది. వయసు మళ్లిన వారు అక్కడ కూర్చొని సేద దీరేందుకు గుమ్మటాలు, చుట్టూ నడక దారి, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువులో వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండను తలపిస్తోంది. చెరువులో బోటు షికారుతో ఆహ్లాదకరంగా మారింది. హైడ్రాను తీసుకొచ్చిన ప్రభుత్వానికి స్థానికులు అభినందనలు తెలిపారు. హైడ్రాతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు.. హైడ్రా అధికారులు, సిబ్బంది ఎంతో దీక్షతో ఈ చెరువును అభివృద్ధి చేశారు.






