- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్తర్ బలగాలు ఇక జార్ఖండ్‌కు!
నక్సల్ ముక్త్ ఛత్తీస్‌గఢ్ దాదాపుగా సఫలమైన నేపథ్యంలో బస్తర్ డివిజన్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నక్సల్ ముక్త్ ఛత్తీస్‌గఢ్ దాదాపుగా సఫలమైన నేపథ్యంలో బస్తర్ డివిజన్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో ఒకటైన దంతేవాడ జిల్లా కటేకల్యాణ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన జారమ్ సీఆర్పీఎఫ్ కోబ్రా దళాల క్యాంపును నిన్న ఎత్తివేసి ఆ బలగాలను జార్ఖండ్‌కు తరలించారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే బస్తర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా నక్సల్ ముక్త్ కాగా, దంతేవాడలో ఒకే ఒక్క మావోయిస్టు దాక్కుని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అబూజ్మాడ్ ప్రాంతం ఉన్న నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు, సుక్మాలో ఐదుగురు, బీజాపూర్ జిల్లాలో 11 మంది, అత్యధికంగా కాంకేర్ జిల్లాలో 19 మంది ఉన్నట్లు వివరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 38 మంది మావోయిస్టులు ఉన్నట్లు, వీరిని కూడా లొంగుబాట పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక ఆదివాసీ నేత పాపారావు సరెండర్ తర్వాత ఈ 38 మంది కూడా వచ్చే మూడు రోజుల్లో దారికి వస్తారని భావిస్తున్నారు. వీళ్ల లొంగుబాటు జరగ్గానే మిగతా జిల్లాల్లో ఉన్న క్యాంపులను కూడా ఎత్తివేసి జార్ఖండ్‌కు పంపిస్తారని ఛత్తీస్‌గడ్ మీడియా వర్గాల భోగట్టా.
క్యాంపుల స్థానంలో ఆదివాసీ సౌకర్య కేంద్రాలు..
ఇలా ఎత్తేసిన క్యాంపుల స్థానంలో ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేసే సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఇక నుంచి భద్రతా వ్యవహారాలను రాష్ట్ర పోలీసు బలగాలు, డీఆర్జీ బలగాలు చూసుకుంటాయని కూడా ఆయన స్పష్టం చేసినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజా గణాంకాల ప్రకారం బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో సుమారు 96% ప్రాంతం ఇప్పుడు నక్సల్ ప్రభావం నుంచి విముక్తి పొందినట్లు భావిస్తున్నారు. కాంకేర్ జిల్లాలో రూపి అలియాస్ రంగబోయిన భాగ్య, బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో హేమ్లా బిచ్చా, సోఢీ కేశా దళాలు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్చి 31 గడువు ముగిసిన తర్వాత ఈ గ్రామాలన్నింటినీ ఒకేసారి లేదా కొన్ని కొన్ని గ్రామాల చొప్పున నక్సల్ ముక్త్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
జనతాన సర్కార్ల రద్దు..
కాగా, మావోయిస్టుల ఆధ్వర్యంలో గ్రామ, ఏరియా, జిల్లా స్థాయిలో ఏర్పడిన జనతన సర్కార్లు ఇప్పుడు వాటంతటకవే రద్దయ్యాయని తెలుస్తోంది. వీటి స్థానంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం గ్రామాల్లో తిష్ట వేసి రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి పనుల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం ఒకప్పుడు నక్సల్స్ కు కోటలుగా ఉన్నమారుమూల గ్రామాలు పర్యటిస్తున్నారని, ప్రజలతో సంభాషిస్తున్నారని చెబుతున్నారు.
జార్ఖండ్‌కు బలగాలు ఎందుకు?
కేంద్ర హోం శాఖ వర్గాల సమాచారం ప్రకారం, దేశంలో మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికీ 130 నుంచి 150 మధ్య సాయుధ క్యాడర్లు మిగిలి ఉన్నారు. వీరిలో పొలిట్‌బ్యూరో సభ్యులు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు, మిసిర్ బెస్రా అలియాస్ సాగర్, మరికొందరు డివిజన్ స్థాయి నేతలు, కేడర్లు ఉన్నారు. ఈ 130-150 మందిలో 100 మంది వరకూ జార్ఖండ్ రాష్ట్ర అడవుల్లోనే మిసిర్ బెస్రా నేతృత్వంలో పనిచేస్తున్నారని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిని లొంగుబాట పట్టిచేందుకు లేదా అంతమొందించేందుకు బస్తర్ నుంచి బలగాలను పంపుతున్నామని చెబుతున్నాయి. వీటిలో నాలుగు కోబ్రా దళాలు, మిగతా బలగాలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీఎఫ్ దళాలు ఉన్నట్లు వివరించాయి.
గణపతి లొంగుబాటుపై సస్పెన్స్..
పొలిట్‌బ్యూరో సభ్యుడు గణపతి లొంగుబాటుపై సస్పెన్స్ డ్రామా ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ విషయంలో వివిధ మీడియా సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నాయి. ఆయన తెలంగాణ ఎస్ఐబీతో టచ్‌లో ఉన్నాడని కొందరు.. ఇప్పటికే లొంగిపోయాడని, 31న ఆయన లొంగుబాటు చూపిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఆయన ఏ పోలీసుల అదుపులో లేడని, లొంగిపోయే అవకాశం కూడా లేదని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా దేశాన్ని మావోయిస్టు ముక్త్‌గా ప్రకటించాలంటే అటు మిసిర్ బెస్రా, ఇటు గణపతి లొంగిపోవడమో లేక అంతం కావడమో జరగాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






