- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి : సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఆపుచేసి ఇరిగేషన్ మేధావులతోనూ, అఖిలపక్ష పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వానికి సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఆపుచేసి ఇరిగేషన్ మేధావులతోనూ, అఖిలపక్ష పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జల అంశాలపై చర్చించాల్సిందేనన్నారు. గోదావరిలో ఇప్పటికే 3 వేల టీఎంసీల నీరు వృథాగా పోతోందన్నారు. శుక్రవారం హైదరాబాద్ మగ్దూం భవన్లో మాజీ ఎంపీ , సీపీఐ నేషనల్సెక్రటరీ అజీజ్పాష, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పశ్య పద్మ తో కలిసి ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనక చర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వరద జలాలపై తెలంగాణకు సైతం హక్కు ఉంటుందని, ఇందుకు సంబంధించి వాటాను తేల్చకుండా ఎపి ఏకపక్షంగా ప్రాజెక్టును ఏలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. జల వివాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని హితవు పలికారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సాగునీటి పారుదల రంగం నిష్ణాతులతో అన్నివిధాలు చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరోవైపు రూ. 85 వేల కోట్ల భారీ వ్యయంతో తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎపిలోని రైతు సంఘాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూర్చుని సముద్రంలో కలిసే సుమారు 3 వేల టిఎంసిల జలాలు ఎవరి వాటా ఎంతో తేల్చుకున్న తర్వాతే కట్టుకోవచ్చునని అన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ది కోసం అనవసర జల వివాదాలు సృష్టించి, తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేలా చేయడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ప్రధాన బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో, వాటిని పక్కనబెట్టి తక్షణమే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టి ఎల్లంపల్లికి నీరు తీసుకెళ్ళాలని, మధ్యలో ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు తుమ్మిడిహట్టిని కూడా చేపడతామన్నారని, ఎందుకు దానిని పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరంలో ప్రధాన భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి దిగువన మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ ఉన్నందున, తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకున్నా ఇబ్బంది ఉండబోదన్నారు.






