Banks: వారంలో 7 రోజులు బ్యాంకులు తెరవండి.. నిర్మలా సీతారామన్‍కు మాజీ ఎంపీ ప్రతిపాదన

by Prasad Jukanti |

వారానికి ఐదు రోజుల పని విధానం కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్న వేళ, బ్యాంకులు వారంలో 7 రోజులు పనిచేయాలంటూ మాజీ ఎంపీ చేసిన ప్రతిపాదనపై చర్చ మొదలైంది.

Banks: వారంలో 7 రోజులు బ్యాంకులు తెరవండి.. నిర్మలా సీతారామన్‍కు మాజీ ఎంపీ ప్రతిపాదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల పని దినాలు, పని గంటల విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మారుతున్న ధోరణులకు అనుగుణంగా ఆయా రంగాల్లో తమ పని దినాల విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ మన దేశంలో ఇవాళ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక చేపట్టిన సమ్మె (Bank Employees Strike) కొత్త చర్చకు దారి తీసింది. బ్యాంకు ఉద్యోగులు తమకు వారానికి ఐదురోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా మరో వైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి Vijay Sai Reddy) మాత్రం అందుకు భిన్నమైన ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చారు. వారంలో వారంలో 7 రోజులు బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండేలా శనివారం–ఆదివారం రొటేషన్ విధానం అమలు చేయాలని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. రొటేషన్ విధానం వల్ల బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలతో పాటు కస్టమర్లకు వారంలో అన్ని రోజులు బ్యాంకులు అందుబాటులో ఉంటాయని అభిప్రాయ పడ్డారు.

కటువుగా ఉన్నా అందరి నోట వినిపిస్తున్న డిమాండే:

ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ తత్వం పెరిగిపోవడంతో ఆయా సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. గతంలో మాదిరిగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ కార్యాలయాలు తెరుచుకునే ఉంటున్నాయి. అందుకోసం సిబ్బందిని రొటేషన్ చేస్తూ తమ సేవలను నిరంతరం కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి. అయితే బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితిలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులు నెలలో అన్ని ఆదివారాలతో పాటు 2,4, శనివారాలలో పని చేయడం లేదు. దీంతో మిగతా రంగాల్లో పని చేస్తున్న వారిలో ఆదివారం, 2,4 శనివారాల్లో సెలవుల్లోనే తమకు సెలవు ఉంటే బ్యాంకు పనులు జరగడం లేదు. ఈ విషయంలో చాలా మంది బ్యాంకు కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నా వ్యవస్థ అందుకు సహకరించని కారణంగా నెట్టుకుపోతున్నారు. అయితే విజయసాయిరెడ్డి ప్రతిపాదించినట్లుగా బ్యాంకులను వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటే మిగతా రంగాల్లో శని, ఆదివారాలు సెలవులు కలిగిన వారు తమ బ్యాంకు పనులను తమకు నచ్చిన రోజు పూర్తి చేసుకునే వెసులుబాటు దక్కుతుంది. ఈ ప్రతిపాదన బ్యాంకు ఉద్యోగులకు కడువుగా కనిపించినా కస్టమర్లు మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ విజయసారెడ్డి ప్రతిపాదన ఏ మేరకు అమల్లోకి వస్తోంది? ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏ మేరకు అంగీకరిస్తాయనేది కీలకం కానుంది.

Next Story