- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకాక్ టు హైదరాబాద్.. జూనియర్ ఆర్టిస్టులతో ‘ఓజీ గంజాయి’ దందా..
బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌కు ఓజీ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ సూరి కళను ఈగల్ ఫోర్స్, ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/సిటీ క్రైం: సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఆర్టిస్టులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఫ్రీగా విదేశీ ప్రయాణం కల్పిస్తామని, తిరుగు ప్రయాణంలో చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకువస్తే సరిపోతుందని నమ్మబలికి, వారికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆఫర్ చేస్తూ మాదకద్రవ్యాల రవాణాకు వినియోగిస్తున్న దుస్థితి వెలుగులోకి వచ్చింది. తాజాగా థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు అత్యంత ఖరీదైన ఓజీ గంజాయి అక్రమంగా తరలిస్తు న్న ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం, ఈగల్ ఫోర్స్, కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ కార్యకలాపాలు బయటపడ్డాయి.
మహిళను లక్ష్యంగా చేసుకుని దందా
కేరళకు చెందిన చల్లిల్ పుత్తన్‌పురాయిల్ నఫ్షీద్ అలియాస్ అలెక్స్, అతని అనుచరుడు రాజు బిశ్వాస్ కలిసి ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. వీరు ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ, సులభంగా డబ్బు సంపాదించే అవకాశంగా ఈ అక్రమ కార్యకలాపాల్లోకి దింపుతున్నారు. ఈ క్రమంలో సనత్‌నగర్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూరి కళ డ్రగ్స్ క్యారియర్ గా ఎంచుకున్నారు. అయితే, గతంలో పట్టుబడ్డ ఓజీ గంజాయి స్మగ్లింగ్ కేసుల ఆధారంగా ఈగల్ ఫోర్స్ ఈ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సూరి కళతో పాటు నఫ్షీద్ కదలికలపై పక్కా సమాచారాన్ని సేకరించి వారిద్దరిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఇమ్మిగ్రేషన్, ఎన్సీబీ అధికారులు ఈనెల 6న బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సూరి కళను ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. అనంతరం ఈగల్ ఫోర్స్, ఎన్సీబీ అధికారులు కలిసి ఆమె లగేజీని పరిశీలించగా 2.15 కిలోల ఓజీ గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
గతంలో ఇద్దరు ఆర్టిస్టులు సైతం..
సూరి కళత పాటు ఆమెకు పరిచయం ఉన్న మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు సైతం ఈ ముఠా వలలో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గంగా భవాని అనే జూనియర్ ఆర్టిస్ట్ గతంలో బ్యాంకాక్ నుంచి వస్తూ బెంగళూరు విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. అలాగే గౌరి అనే మహిళ చెన్నై విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. ఈ ఘటనలు ఈ ముఠా ఎంత విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందో సూచిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా అధికారులు మరో ముఖ్య అంశాన్ని గుర్తించారు. ఈ ముఠా ప్రధానంగా గృహ కార్మికులు, చిన్నపాటి పనులు చేసే మహిళలు, సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే వ్యక్తులను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం నఫ్షీద్ అలియాస్ అలెక్స్, రాజు బిశ్వాస్ పరారీలో ఉన్నారు. ఈ కేసును అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి దర్యాప్తు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మూడు ట్రిప్పులు.. ముప్పై వేలు
డబ్బుల ఆశతో తాను ఇదివరకే రెండు సార్లు డ్రగ్స్ రవాణా చేసినట్లు సూరి కళ వెల్లడించింది. ఆమె వివరాల ప్రకారం.. మొదటిసారి ఈ ఏడాది మార్చిలో నఫ్షీద్ ఆమెను బ్యాంకాక్‌కు పంపించాడు. అక్కడ రెండు రోజుల పాటు ఉంచిన తర్వాత, ఆమె లగేజీలో చాక్లెట్ల ముసుగులో గంజాయి ప్యాకెట్లు దాచిపెట్టి చెన్నైకు పంపించారు. చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే రాజు బిశ్వాస్ అనే వ్యక్తికి ఆ ప్యాకెట్లను అప్పగించగా, ఆమెకు రూ.20 వేల పారితోషికం ఇచ్చారు. రెండోసారి ఏప్రిల్‌లో ఆమెను బెంగళూరు నుంచి బ్యాంకాక్‌కు పంపించారు.
అక్క డ మళ్లీ అదే పద్ధతిలో గంజాయి ప్యాకెట్లు లగేజీలో ఉంచి హైదరాబాద్‌కు పంపించారు. నగరానికి చేరుకున్న తర్వాత, ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఒక ప్రైవేట్ నివాసంలో నఫ్షీద్ అనుచరులకు వాటిని అప్పగించింది. ఈసారి రూ.10 వేలు ఇచ్చారు. మూడోసారి జూన్ మొదటి వారంలో ఆమెను మళ్లీ బ్యాంకాక్‌కు పంపించారు. అయితే ఈసారి ఎవరు పెట్టారో తెలియని విధంగా ఆమె లగేజీలో డ్రగ్స్ ఉంచి పంపినట్లు విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లో దిగిన వెంటనే అధికారులు పట్టుకోవడంతో వ్యవహారం బయటపడింది.
ఉచ్చులో పడొద్దు: ఈగల్ ఫోర్స్
డ్రగ్స్ సిండికేట్లు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈజీ మనీ పేరుతో ఎలా ఉచ్చులోకి లాగుతున్నాయో ఈ కేసే నిదర్శనమని ఈగల్ ఫోర్స్, ఎన్సీబీ, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు తెలిసి, మరికొందరు ఏముందో తెలియక ఇలాంటి దేశ వ్యతిరేక నేరాల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చే ప్రతి డ్రగ్ ప్యాకెట్ ఎన్నో కుటుంబాలను, యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. అమాయకులు ఇలాంటి వారి వలలో పడొద్దని, అక్రమ డ్రగ్స్ రవాణాపై ఏమాత్రం అనుమానం వచ్చినా ఈగల్ ఫోర్స్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.






