Puranapool incident: మా విశ్వాసంతో ఆటలాడకండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-01-15 11:50:20  IST  )

ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Puranapool incident: మా విశ్వాసంతో ఆటలాడకండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పురానాపూల్ దర్వాజలోని మైసమ్మ ఆలయంలోకి (Puranapul Maisamma Temple) నిన్న రాత్రి అగంతకుడు చొరబడి చేసిన దాడుల ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సీరియస్ అయ్యారు. మా విశ్వాసంతో ఆడుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొన్న సఫిల్‍గూడ కట్ట మైసమ్మ ఆలయంలో ఓ వ్యక్తి మల, మూత్ర విసర్జన ఘటన మరువక ముందే ఇప్పుడు పురానాపూల్ ఘటన జరిగింది. కాంగ్రెస్.. ఇంకెన్ని ఆలయాలు కావాలి అని ప్రశ్నించారు. ఇవాళ ఎక్స్ వేదికగా పోస్టు చేసి బండి సంజయ్.. ఆలయాలపై వరుస దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఘటనకు అసదుద్దీన్ ఒవైసీ సంబంధం లేదంటూ నిస్సిగ్గుగా సంఘ్ ను నిందిస్తున్నాడని మండిపడ్డారు.

నటించడం ఆపండి:

మొదటి సారి ఘటన జరిగినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని దీంతో వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు సాధారణంగా మారుతున్నదా? హిందువులు శాంతంగా ఉంటారని ఈ నగరాన్ని పరీక్షిస్తున్నారా? అని ప్రశ్నించారు. హిందువులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తే వారిపై కేసులు పెడుతున్నారని అదే నేరస్థులను మాత్రం మానసిక పరిస్థితి సరిగా లేదంటూ రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఇది యాదృచ్చికంగా జరిగుతున్న సంఘటనలు కావని పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయన్న దాడులు అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, చట్టం స్థానంలో బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఇకనైనా ఏమీ జరగనట్లు నటించడం ఆపి దేవాలయాలకు భద్రత కలిపించాలన్నారు.

Next Story