CM కేసీఆర్‌కు ఆ పని చేసే దమ్ముందా..? ఆవిర్భావ దినోత్సవ వేళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
CM కేసీఆర్‌కు ఆ పని చేసే దమ్ముందా..? ఆవిర్భావ దినోత్సవ వేళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ఓవైసీ పాల్గొనలేదని, దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయనందుకు దారుస్సలాంకు తాళం వేసే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదని బండి సంజయ్ చిట్ చాట్‌లో తెలిపారు. నిజమైన ముస్లింలు ఎంఐఎం పార్టీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్నెళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు పంచుతామని బండి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.

ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బండి ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మారడం తనకు చేతకాదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం కూడా తనకు చేతకాదన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని చురకలంటించారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో వాళ్లే చెబుతారన్నారు. తనకు పార్టీ నడపడం చేతకాకుంటే హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలిచామో చెప్పాలన్నారు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం కూడా తనకు చేతకాదన్నారు. తాము గెలుపు పరంపరం కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయి ఓటమి పరంపర సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తమ పార్టీలో సీనియర్లు బాస్‌లు అని సంజయ్ చెప్పారు. అదే కాంగ్రెస్‌లో అయితే హోంగార్డులు అని ఆయన పేర్కొన్నారు. ఇది తాను చెప్పడంలేదని రేవంత్ రెడ్డే అన్నారన్నారు. కాంగ్రెస్‌కు అసలు క్యాండిడేట్లు కూడా దొరుకట్లేదని బండి విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎక్కడుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఈ ప్రశ్నను అతడి తండ్రి కేసీఆర్‌ను అడగాలని బండి సూచించారు. బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో అనేది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందని క్లారిటీ ఇచ్చారు.

తమది కుటుంబ పార్టీ కాదని, అయ్య పేరు చెప్పి కూతురు, కొడుకు సీఎంలు అయ్యే పార్టీ తమది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ తమది కాదన్నారు. అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు, కొడుకు లేకుంటే అల్లుడు సీఎం అయ్యే పార్టీ ఎవరిదో అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని, నేడు తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని, అయితే ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవవల్లే జరిగిందని బండి చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

Also Read..

రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ!


Next Story

Most Viewed