అక్కడికి CM రేవంత్, కేటీఆర్ కలిసే వెళ్లారు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జాన్ జబ్బలు (ప్రాణ మిత్రులు) గా మారారు.

అక్కడికి CM రేవంత్, కేటీఆర్ కలిసే వెళ్లారు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జాన్ జబ్బలు (ప్రాణ మిత్రులు) గా మారారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో కేసీఆర్ కుటుంబం అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వమే ఆ కేసులను నీరుగారుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, ఫాంహౌజ్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే మొదట్లో మాట్లాడారు. కానీ కేటీఆర్ తో కుమ్మక్కైన తరువాత ఆ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవార ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నారు. 6 గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో, బయట నిలదీయకుండా ఉత్తుత్తి డ్రామాలాడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) భూములను తెగనమ్మడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.

వాస్తవానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్య మైత్రి ఎన్నడో బట్టబయలైంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. త్వరలో హైదరాబాద్ లో జరగబోయే బహిరంగ సభ నిర్వహణ, ఆ సభకు ఎవరెవరిని పిలవాలో ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసేలా నిర్ణయం తీసుకుంది కూడా వారిద్దరే. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ ను గెలిపించేందుకు సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి, కేటీఆర్ లే. అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంచింది కూడా కేటీఆరే అని ఆరోపించారు.

విజ్ఝులైన తెలంగాణ ప్రజలు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించినా వారిలో మార్పు రాకపోగా బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తుండటం సిగ్గు చేటు. హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసే బీజేపీపై బురదచల్లేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

హెచ్ సీయూ భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలి. ఎందుకంటే కేంద్రంలో కొనసాగుతున్నది కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన కాదు. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన నరేంద్ర మోడీ పాలన అని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు సిద్ధపడితే హెచ్ సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో, వారికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ దమ్ముందా? అట్లాగే హెచ్ సీయూ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా? తేల్చుకోవాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

Next Story