- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ సినిమాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హిందీ సినిమాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘హిందీ(Hindi Language) కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘హిందీ దివస్’ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాష అనేది నాగరికత మరియు సంస్కృతికి ఆత్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా భాష కేవలం వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, జాతీయ చైతన్యానికి ఆత్మ. మోడీ నాయకత్వంలో భారత్ నేడు ఆత్మనిర్భరత వైపు, విశ్వగురువుగా మారే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర భారతానికి అతి పెద్ద శక్తి దాని స్థానిక భాషలు, మాతృభాషలే. మోడీ నాయకత్వంలో రూపొందిన జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు విద్య, జ్ఞానానికి మూలాధారంగా ప్రాధాన్యం ఇవ్వబడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీ, భారతీయ భాషలను సాంకేతికత, పరిపాలనలో విరివిగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారు. అట్లాగే రాజభాషా విభాగం ఎన్నో ప్రాజెక్టులను ఆరంభించింది. వాటి ద్వారా హిందీతోపాటు ఇతర భారతీయ భాషలు డిజిటల్ యుగంలో మరింత శక్తివంతం అయ్యాయి.
భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఆలోచనలు, భావాలు, సంస్కారాల వాహకురాలు. అది మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షకురాలు. సమాజ అభివృద్ధికి పునాది. మన గుర్తింపులో అంతర్భాగం. మాతృభాష మన హృదయానికి అత్యంత చేరువైనది. విదేశీ భాషలు మన జ్ఞానం, అవకాశాలను విస్తరిస్తాయి. అందువల్ల ప్రతి భాషను సంరక్షించడం, గౌరవించడం మన ప్రధాన కర్తవ్యంగా భావించాలి. గతకొన్ని సంవత్సరాలలో రాజభాషా విభాగం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను చేపట్టింది. హిందీ శబ్ద సింధు డిజిటల్ నిఘంటువులో ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. అందులో సుమారు ఇరవై ఐదు వేల పదాలు భారతీయ భాషల నుండి సేకరించబడ్డాయి. ఇది కేవలం హిందీకి విస్తరణ మాత్రమే కాదు, భారతీయ భాషల మధ్య ఒక సంధాన సేతును నిర్మించడం కూడా. భారతీయ భాషా విభాగ ప్రాజెక్ట్ హిందీ, భారతీయ భాషల మధ్య సమన్వయానికి అద్భుతమైన ఉదాహరణ. కంఠస్థ్, అనువాద్ సాధన్ మరియు ఇతర సాంకేతిక టూల్స్, రాజభాషా అమలును సులభతరం చేసి ఆధునికతను చేర్చాయి. ఈ పరికరాలు హిందీ మరియు భారతీయ భాషలను పరిపాలన, విద్య, సాంకేతికతలతో అనుసంధానిస్తున్నాయి. ఈ రోజుల్లో హిందీ ప్రపంచ వేదికపై బలమైన స్థానంలో నిలిచింది. విద్య, కమ్యూనికేషన్, పరిపాలన భాషగా హిందీ ప్రాధాన్యం నిరంతరం పెరుగుతోంది. హిందీ సినిమా, సాహిత్యం, జర్నలిజం దీనిని ప్రజాదరణలో కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. విదేశాలలో కూడా కోట్ల మంది హిందీ సినిమాలు చూస్తున్నారు.. హిందీ మాట్లాడుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై హిందీకి వచ్చిన అంగీకారం, భారతదేశ సాంస్కృతిక శక్తికి ప్రతీక.
హిందీ రాజభాషా కావడంతో ప్రభుత్వ పనితీరులో ఒక విధమైన సమన్వయం వచ్చింది. ప్రభుత్వ పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు (కరస్పాండెన్స్) హిందీలో లభించడం వలన ప్రజలకు, ప్రభుత్వానికీ మధ్య దూరం తగ్గింది. సాధారణ పౌరుడికి నేరుగా పాలనతో సంభాషించే సౌకర్యం లభించింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నేను హిందీయేతర రాష్ట్రమైన తెలంగాణ నుంచి వచ్చాను. కానీ అమిత్ షా ప్రేరణతో అన్ని ప్రభుత్వ పనుల్లోనూ, మాట్లాడే భాషలోనూ హిందీని సులభంగా ఉపయోగిస్తున్నాను.
ఇక ముందు హిందీ మరియు భారతీయ భాషలకు విద్య, వ్యాపారం, సాంకేతికతసహా అన్ని రంగాల్లో స్థానం ఇవ్వాలి. జ్ఞానం, విజ్ఞానం, అంతర్జాతీయ పరిశోధనల నిలయాలు కావాలి. మన మాతృభాష ఇల్లు, కుటుంబం వరకు మాత్రమే పరిమితం కాకుండా, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు ఆధారమవ్వాలి. ప్రయోగశాలల పరిశోధన పత్రాల్లో చోటు పొందాలి. అంతర్జాతీయ వేదికలపై కూడా సమానమైన ప్రాధాన్యం కలిగి నిలవాలి. హిందీ మరియు ఇతర భారతీయ భాషల్లోనే మెడికల్ పరిశోధనా పత్రాలను రాస్తే, ఆ జ్ఞానం దేశంలోని ప్రతి మూలకు సులభంగా చేరుతుంది. ఇంజినీరింగ్, సాంకేతిక సంస్థల్లో మషీన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లో పరిశోధనలు మన భాషల్లోనే జరిగితే, జ్ఞానపు ప్రజాస్వామీకరణ నిజంగా సాధ్యమవుతుంది. కోర్టుల్లో తీర్పులు స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటే, న్యాయం ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా అందుతుంది.
మన మాతృభాష శాస్త్రీయ పరిశోధన భాషగా, పరిశ్రమ-వ్యాపార భాషగా, డిజిటల్ సంభాషణ భాషగా, అంతర్జాతీయ దౌత్య భాషగా మారేలా చూడాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. భారత యువ శాస్త్రవేత్తలు హిందీ, భారతీయ భాషల్లోనే పరిశోధనలు చేయాలి. వ్యాపారవేత్తలు తమ వ్యాపార మోడళ్లను ఈ భాషల్లోనే సృష్టిస్తే, సాంకేతిక పరికరాలు ఈ భాషల్లోనే సులభంగా అందుబాటులో ఉంటే, అప్పుడు మాత్రమే నిజమైన అర్థంలో ఆత్మనిర్భర్ భారత్ స్వప్నం సాకారం అవుతుంది. అంతిమంగా హిందీతో పాటు అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఏకత్వం మరింత బలపడుతుంది. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో హిందీ, భారతీయ భాషల యాత్ర నిరంతరం ముందుకు సాగుతుందని, భారతదేశాన్ని ఆత్మనిర్భర్, విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో ఇది విశేషమైన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు అని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.






