- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామీద 109 కేసులు ఉన్నాయి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నామీద 109 కేసులు ఉన్నాయి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లేనని, అందుకే డాక్టర్లను దైవంగా కొలుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. అంతటి పవిత్రమైన వ్రుత్తిలో కొనసాగబోయే వైద్య విద్యార్థులంతా భవిష్యత్తులో ఫార్మా కంపెనీల, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. నిరంతరం వైద్య విజ్ఝానంలో మార్పులు వస్తూనే ఉంటాయని, ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ కాకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ మాదిరిగా డాక్టర్లు మారితే ‘డాక్టర్ మాత్ర రోగుల పాలిట వైకుంఠ యాత్ర’ అవుతుందని అన్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ప్రతిమ మెడికల్ కాలేజీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంలో మంచి పేరున్న కాలేజీ. 24 ఏళ్లలో ప్రతిమ కాలేజీ ఎంతో ఎత్తుకు ఎదిగి ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రసాదమైంది. గర్భిణీ మహిళలకు ‘‘తల్లి బిడ్డ సంక్షేమ పథకం’’ కింద కేవలం 2 వేల రూపాయలు చెల్లిస్తే ప్రెగ్నెంట్ నుండి డెలవరీ వరకు పూర్తిస్థాయిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. విద్య, విలువలకు నిదర్శనం ప్రతిమ. అందుకే ఇక్కడ మెడికల్ సీటుకు డిమాండ్ ఉంది.
ఎంబీబీఎస్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ కాదు.. ఐదేళ్ల టెస్ట్ మ్యాచ్.. మెడికల్ సబ్జెక్టులు అర్ధంకాక నిద్రలేని రాత్రులు, నోట్స్‌తో కుస్తీలు.. మెడికల్ స్టూడెంట్ జీవితం కంటికి కన్పించని శత్రువుతో యుద్ధం లాంటిది. మిగతా విద్యార్థులు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మీరు రాత్రింబవళ్లు చదువులు.. బ్రెయిన్ ఓవర్‌లోడ్ అవుతుంది. “అసలు మనకు ఇంత స్ట్రెస్ అవసరమా?” అనే భావన కలుగుతుంది. ఇది అవసరమే. ఎందుకంటే మీదగ్గరికొచ్చే పేషెంట్లు “డాక్టర్.. నన్ను బతికించండి’ అనే అంటారు. ప్రాణం పోసి బతికిస్తే అంతకంటే కావాల్సిందేముంది?
అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన ఇస్తాడు. అందుకు నిదర్శనం నేనే. గతంలో నేను ర్యాలీ తీస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాను. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళితే.. 12 సార్లు షాక్‌లు ఇచ్చారు. 5 రోజులు ఐసీయూలో ఉంచి కాపాడారు. అందుకే కరీంనగర్‌లో డాక్టర్లంటే నాకు అభిమానం. వాళ్లను కాపాడుకుంటా. అంతగొప్ప వృత్తిలోకి అడుగు పెట్టబోయే మీరంతా ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఇచ్చే ఆఫర్లకు లోనై వారి వలలో పడితే ప్రజలకు అన్యాయం చేసినవారవుతారు. కోవిడ్‌ను ఆసరా చేసుకుని కోట్లు సంపాదించిన ఆసుపత్రులెన్నో ఉన్నాయి. డబ్బులు చెల్లించకపోతే పేషెంట్ల ప్రాణాలను కాపాడుకుండా గాలికి వదిలేశాయి. కాబోయే డాక్టర్లంతా డాక్టర్ వృత్తిని వ్యాపారంగా కాకుండా మంచి ఆలోచనతో ప్రజలకు వైద్య సేవలందించి ‘ఆరోగ్య భారత్’ను నిర్మాణానికి సహకరించాలి.
ప్రజాస్వామ్య దేశంలో విద్య, వైద్యం రెండూ ప్రభుత్వాల బాధ్యతే. దురదృష్టవశాత్తు 1947 నుండి విద్య, వైద్యాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. మనదేశంలో సరిపడా ఆసుపత్రులు లేవు. 2025 లెక్కల ప్రకారం.. డబ్ల్యూహెచ్ ప్రకారం వెయ్యి మందికి 4 బెడ్లు ఉండాలి. మన దగ్గర 1.5 బెడ్ మాత్రమే ఉంది. 140 కోట్ల జనాభాకు సరిపడా బెడ్లు లేవు. ఇండియాలో 70 వేల ఆసుపత్రులున్నాయి. 26 వేల ప్రభుత్వ, 43 వేల ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య బాగానే ఉంది. WHO ప్రకారం.. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. మన దగ్గర 1200 మందికి ఒక డాక్టర్ ఉన్నడు. పెద్ద తేడా లేదు. మన దేశంలో దాదాపు 14 లక్షల మంది మెడికల్ ప్రాక్టీసనర్స్, మరో 20 లక్షల మంది ఆయుష్, యునానీ డాక్టర్లున్నరు. కానీ ఆ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా ఎక్కువగా అర్బన్ సెంటర్లకే పరిమితమవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అర్బన్‌కే పరిమితమయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ అసమానత పోవాలంటే.. ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్లు కూడా తమ పిల్లలకు అవసరమైన విద్య, ఇతర సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉన్నాయన్పిస్తే.. అక్కడ పని చేయడానికి సిద్ధపడతారు. అప్పుడే ఈ అసమానత పోతుంది. డాక్టర్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావాలి.
అట్లాగే ఎంబీబీఎస్ అయ్యాక పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్‌లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఫీజు చెల్లించే స్తోమత లేక ఉన్నత చదువుకు చాలా మంది దూరమవుతున్నారు. దీనిపై అందరం చర్చించి ఓ విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ ఫీల్డ్ లోనైనా కష్టపడి నిజాయితీగా సేవలందిస్తే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు. రాజకీయాల్లో ప్రజలకు సేవలందిస్తూ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రినయ్యారు. ప్రజల కోసం చేసిన పోరాటాలవల్ల నాపై 109 కేసులు పెట్టారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షా ఎదుట అడిగితే.. ‘‘అందుకే సంజయ్ ను కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి’’ అయ్యారని అన్నారు. మీరు కూడా డాక్టర్ వృత్తిలో నిబద్ధతతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా అని బండి సంజయ్ స్పష్టం చేశారు.






