HYD MLC: ఓటేయబోయే కార్పొరేటర్లకు బండి సంజయ్ సంచలన పిలుపు

by Gantepaka Srikanth |

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి(Babu Jagjivan Ram Jayanti) సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘన నివాళులు అర్పించారు.

HYD MLC: ఓటేయబోయే కార్పొరేటర్లకు బండి సంజయ్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి(Babu Jagjivan Ram Jayanti) సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్టడుగువర్గాల ఆణిముత్యం జగ్జీవన్ రామ్ అన్నారు. ఆయన ఆశయాల సాధనకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. అంబేద్కర్(Ambedkar) నుండి జగ్జీవన్ రామ్ వరకు అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు. అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో అవమానించి మంత్రి పదవికి రాజీనామా చేయించిన పార్టీ కాంగ్రెస్(Congress) అని.. డూప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇచ్చి.. అంబేద్కర్‌ను విస్మరించారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ తరువాత దేశాన్ని పాలించే సత్తా బాబూ జగ్జీవన్ రామ్‌కు ఉన్నా.. ప్రధాని ఇవ్వకుండా ఎమర్జెన్సీ పెట్టి అరాచకం సృష్టించారని అన్నారు.

తెలంగాణలోని రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ చేస్తున్నది మోడీ ప్రభుత్వమే అని అన్నారు. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో కాంగ్రెస్ తామే సొంతంగా పంపిణీ చేస్తున్నట్లు డ్రామాలాడుతోందని విమర్శించారు. కళాకారులను మైమరపించేలా కాంగ్రెస్ నేతల డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు సరిగా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ షాపుల్లో మోడీ ఫొటో(Modi Photo) పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. వాళ్లు పెట్టకపోగా.. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటోలు పెడితే చించి వేయించడం ఎంత వరకు కరెక్ట్? అని అడిగారు.

అసలు ప్రధాని ఫొటో పెడితే మీకున్న అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు. తక్షణమే రేషన్ షాపు(Ration Shop)ల వద్ద ప్రధాని ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల వద్దకు వెళ్లి భోజనం చేసి సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ మండలాధ్యక్షులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హెచ్ సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ అమానుషంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన యూనివర్శిటీ స్కాలర్ రోహిత్‌పై దాడి చేసి జైలుకు పంపడం సరికాదని తెలిపారు. అక్రమంగా ఆయుధాల కేసు పెట్టి రోహిత్ జీవితాన్ని నాశనం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులపై ఇంత అమానుషంగా వ్యవహరించిన కాంగ్రెస్ తీరును జనం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. బేషరతుగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. భూముల అమ్మకాల్లో బీఆర్ఎస్‌ను మించి కాంగ్రెస్ పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి భావి తరాలకు గజం జాగా లేకుండా చేస్తున్నాయని అన్నారు. ‘దేశద్రోహ మజ్లిస్ పార్టీకి, దేశభక్తిగల బీజేపీ పార్టీకి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరుగబోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి హైదరాబాద్‌ను మజ్లిస్ కు అప్పగించేందుకు సిద్ధమైనయ్. ఓటేయబోయే హైదరాబాద్ కార్పొరేటర్లరా?.. దేశభక్తి పార్టీ అభ్యర్ధికి ఓటేస్తారా?.. దేశద్రోహ పార్టీకి ఓటేస్తారా? ఆలోచించండి’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Next Story