బీజేపీ అలాంటి పార్టీ కానే కాదు.. మహిళా దినోత్సవం వేళ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా మహిళలందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలియజేశారు.

బీజేపీ అలాంటి పార్టీ కానే కాదు.. మహిళా దినోత్సవం వేళ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా మహిళలందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘అమ్మవారి శక్తి స్వరూపాలు.. సృష్టికి మూల కారకులు.. కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి పాపలా కాపాడుతున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే.. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు’ అని పేర్కొన్నారు.

‘మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి.. ఆ తరువాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కానేకాదు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ(BJP). ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రధమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ. ఏ మహిళల చేతిలో డబ్బు ఉందో ఆ కుటుంబం, ఆ దేశం సురక్షితంగా, ప్రగతి పథంలో నడుస్తుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మహిళకు ఆర్ధిక మంత్రి పగ్గాలు అప్పగించడంతోపాటు కేంద్ర కేబినెట్‌లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత భాగస్వామ్యం కల్పించారు.

దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కట్టించి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి తాళాలు అప్పగించడంతోపాటు మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు సిద్ధమైన నాయకుడు మోడీ. మహిళల పేరుతో 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 25 కోట్ల మంది మహిళలకు 10 లక్షల కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి నా అక్కా చెల్లెళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తూ ‘‘మహిళా శక్తి’’కి అసలైన నిర్వచనం చెబుతూ మహిళా సాధికారత అంటే ఏమిటో చేతల్లో చూపుతున్న మహనీయుడు మోడీ. దేశంలోని 11 కోట్ల మంది ఉజ్వల కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యి బాధ లేకుండా చేసి మహిళల కంట కన్నీరు తుడిచిన వ్యక్తి మోడీ. బేటీ బచావో - బేటీ బచావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు.

‘మహిళా శక్తి’ అంటే మహిళా దినోత్సవం నాడే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పత్రికల్లో, టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలిస్తూ ప్రచారం చేసుకోవడం కాదు. ఆచరణలో చూపాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2500లు ఇస్తామన్నారు. 15 నెలలైనా నయాపైసా ఇయ్యలేదు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదు. మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం నాడు మాత్రమే ‘మహిళలను శక్తి’గా మారుస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే నమ్మేదెవరు? రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న నా తెలంగాణ మహిళలు చైతన్యవంతులు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్రు కాల్చివాత పెట్టడం తథ్యం’ అని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story