- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేంటి? మార్వాడీ గో బ్యాక్‌పై బండి సంజయ్ ఫస్ట్ రియాక్షన్
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొదటి సారి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మార్వాడీ గో బ్యాక్ (Marwadi Go Back) ఉద్యమంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మొదటి సారి స్పందించారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని తెలిపారు. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు రోహింగ్యాల (Rohingya) గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు.
ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కుందని, తెలంగాణలో ఇతర రాష్ట్రాల వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్లు ఉండకూడదని అంటున్నారా? అని ప్రశ్నించారు. సిగ్గుండాలే.. ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నంచారు. హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు పాతబస్తీని అడ్డాగా మార్చి ఐఎస్ఐ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయని అన్నారు. రోహింగ్యాల వల్ల తెలంగాణకు ప్రమాదముందని నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అని నిలదీశారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది.. రోహింగ్యాలు గో బ్యాక్.. హిందువుల కుల వృత్తులను కాపాడాలని మేం ఉద్యమం చేస్తామని అన్నారు.
అలాగే.. ఓట్లను తొలగించేది, చేర్చించేది ఎన్నికల సంఘం పని.. ఓట్లకు బీజేపీకి సంబంధం ఏముంది? అని ప్రశ్నించారు. పాతబస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నాయని అనేక ఆందోళనలు చేస్తున్నారని.. ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి? వాటిని తీసేయాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాటిని మీరు ఎందుకు తొలగించాలని ఎందుకు ఈసీకి చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ బతుకు కుక్కలు చింపిన విస్తరిలా మారిందని విమర్శలు గుప్పించారు.






