ఆదాయం ఉంటేనే సీట్లా? మరి పాలమూరు గతేంటి?: CM రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్

by Gantepaka Srikanth |

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆదాయం ఉంటేనే సీట్లా? మరి పాలమూరు గతేంటి?: CM రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమని, అట్టడుగు వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి వాదనను బండి సంజయ్ తప్పుబట్టారు. "అదే నిజమైతే హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? మీరు పుట్టిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్ వంటి జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు మూటలు పంపి, పంపి ఇప్పుడు డబ్బు ప్రాతిపదికనే సిద్ధాంతాలు రచిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ ముక్కలు చేయాలని చూస్తోందని సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ జయంతికి ముందే ఆయన ఆశయాలను చంపేసేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని, అంబేద్కర్ బతికుంటే కాంగ్రెస్‌ను దేశం నుండి బహిష్కరించేవారని అన్నారు.

మోడీది 'అంత్యోదయ' సిద్ధాంతం...

డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే బీజేపీ ఆశయమని పేర్కొన్నారు. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచాలని నిర్ణయించిన ఘనత ప్రధాని మోదీదేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని బండి సంజయ్ ఆరోపించారు. 5 దశాబ్దాల పాలనలో ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో పార్లమెంట్‌లో బిల్లు కాపీలు చించివేసిన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో కాంగ్రెస్ ఇప్పుడూ అంటకాగుతోందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నైజాన్ని బయటపెట్టాయని, విభజన రాజకీయాలు చేయడం మానుకొని ఇప్పటికైనా నిజం మాట్లాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story