‘మా సహనాన్ని పరీక్షించొద్దు’.. బీఆర్ఎస్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

by Gantepaka Srikanth |

హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

‘మా సహనాన్ని పరీక్షించొద్దు’.. బీఆర్ఎస్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గురువారం రాత్రి కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి జరిగిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. "దాడులు చేయడం, దౌర్జన్యాలకు దిగడం మా సంస్కృతి కాదు. అధికారం లేకపోయినా బీఆర్ఎస్ నేతలు మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నారు. మా కార్యకర్తలకు కూడా సహనం ఉంటుంది.. కానీ మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఊరుకోం" అని ఆయన హెచ్చరించారు.

దాడుల కల్చర్ మొదలుపెట్టిందే బీఆర్ఎస్..

ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చెబుతున్న నీతులు చూస్తుంటే నవ్వొస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఆ పార్టీ చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలన రజకార్ల పాలనను తలపించింది. నాటి దాడుల కల్చర్‌కు ఆ పార్టీయే ఆద్యుడు అని విమర్శించారు. గతంలో తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయని, పదుల సంఖ్యలో కార్లను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. చివరికి మహిళా కార్యకర్తలను కూడా వదలకుండా దాడులు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని దుయ్యబట్టారు. గతంలో చేసిన దాడులను మర్చిపోయి ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నించడం హాస్యాస్పదమని బండి సంజయ్ అన్నారు. ఎవరెలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, అహంకారాన్ని వీడకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హితవు పలికారు.

Next Story