- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి ఆయనే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్(Central Budget)లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధం. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించాం.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్(Central Budget)లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధం. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించాం. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని అన్నారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? అని సవాల్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చలో ప్రజలకు తెలిసేలా మాట్లాడుకుందామని అన్నారు. ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదని సీరియస్ అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం నిధులు పెరిగాయని అన్నారు.
దేశానికి సంబందించిన బడ్జెట్‌లో ఒక రాష్ట్రం పేరు లేనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదని సరికాదని అన్నారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే అని అన్నారు. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహీ కేసీఆర్(KCR) అని తెలిపారు. SLBC ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కూడా ఆ రెండు పార్టీలే అని.. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మొదట వేలెత్తి చూపింది తామే అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు.. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులు ఏమైపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి పోయి కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్‌తో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడని అన్నారు.
లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్(Congress)కు అనుకూలంగా ఉండేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను నిలబెట్టలేదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి.. అందులో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఏం న్యాయం చేసినట్లు అని అడిగారు. దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగుణన తప్పుల తడక అని అన్నారు. 3.95 కోట్ల ఆధార్ కార్డులుంటే.. జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటారని ప్రశ్నించారు. 6 గ్యారంటీలే ప్రధానాస్త్రాలుగా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మేం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.






