గల్లా పట్టి నిలదీయండి.. బండి సంజయ్ సంచలన పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-09 12:51:39  IST  )

‘‘బీసీ జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారు? మీ జాతి ఏందన్నా.. మీ అయ్య జాగీరనుకుంటున్నారా? మేం బొట్టు పెట్టుకుంటాం. మాకు జన్మ నక్షత్రం ఉంటుంది. గోత్రనామాలుంటాయి.

గల్లా పట్టి నిలదీయండి.. బండి సంజయ్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘బీసీ జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారు? మీ జాతి ఏందన్నా.. మీ అయ్య జాగీరనుకుంటున్నారా? మేం బొట్టు పెట్టుకుంటాం. మాకు జన్మ నక్షత్రం ఉంటుంది. గోత్రనామాలుంటాయి. మొలదారం కట్టుకుంటాం. ఇది మా జాతి. ఒక జాతికి, ఇంకో జాతికి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్. అసలు హిందువులకు, ముస్లింలకు పోలికేమిటి? హిందువులు అడుక్కోవాలా? బిచ్చగాళ్లను చేద్దామనుకుంటున్నారా?’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ప్రశ్నించారు. అసలు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా? అంటూ మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేస్తారు? వారి ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు.

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి హిందువులకు అన్యాయం చేసినప్పుడు హిందుత్వ వాదులు, బీసీ సంఘాలు స్పందించకపోవడంవల్లే ఈరోజు ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీయాలని ముస్లింలను బీసీ జాబితాలో కలిపే కుట్రకు తెరదీశాయన్నారు. అగ్రకులాల ప్రజలు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై సానుభూతి తెలుపుతుంటే... బీసీ సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నాయని మండిపడ్డారు. బీసీలతోపాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను హామీలెందుకు అమలు చేయలేదో నిలదీస్తూ గల్లాపట్టి అడగాలని పట్టభద్రులు, టీచర్లకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్ల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపైన, బీసీ సంఘాల తీరుపైన నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే కరువయ్యారు. దేశ చరిత్రలో అధికార పార్టీకి మంచి అభ్యర్థులు కరువైపోవడం విచిత్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనయ్. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ సహా పలు అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కాకుండా రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టకుండా కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. రెండు పార్టీలు కలిసి బీజేపీని గెలవనీయకూడదని కుట్ర పన్నాయి. రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

Next Story